
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. SBIలో 9,124 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!
WEB DESC : దేశంలోని ప్రముఖ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త అందించింది. క్లరికల్ కేడర్‌లోని జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) పోస్టుల భర్తీకి సంబంధించి అధికారిక రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
దేశవ్యాప్తంగా మొత్తం 9,124 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 7,680 రెగ్యులర్ ఖాళీలు ఉండగా, 1,444 బ్యాక్‌లాగ్ ఖాళీలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో 260 రెగ్యులర్ ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్టు 11 నుంచి ఆగస్టు 31, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పూర్తి చేసి ఉండాలి.
డిగ్రీ చివరి సంవత్సరం లేదా సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు కూడా తాత్కాలికంగా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే డిగ్రీ పాసైనట్లు డిసెంబర్ 31, 2026 నాటికి తగిన ధ్రువపత్రాలను చూపించాల్సి ఉంటుంది. ఏ రాష్ట్రం నుంచి దరఖాస్తు చేసుకుంటున్నారో ఆ రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాష వచ్చి ఉండడం తప్పనిసరి. ఏప్రిల్ 1, 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
అంటే 02-04-1998 మరియు 01-04-2006 మధ్య జన్మించిన వారు అర్హులు. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు వేతన శ్రేణి రూ. 24,050 నుంచి రూ. 64,480 వరకు ఉంటుంది. ముంబై వంటి మెట్రో నగరాల్లో డీఏ మరియు ఇతర అలవెన్సులతో కలుపుకొని ప్రారంభ జీతం నెలకు దాదాపు రూ. 46,000 వరకు లభిస్తుంది.
జనరల్, ఓబీసి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ. 750గా నిర్ణయించగా, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మాజీ సైనిక ఉద్యోగులకు ఎలాంటి ఫీజు లేదు. ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. మొదటగా ప్రిలిమినరీ పరీక్ష (100 మార్కులు), ఆ తర్వాత మెయిన్ పరీక్ష (200 మార్కులు), చివరగా స్థానిక భాషా నైపుణ్య పరీక్ష (Local Language Proficiency Test) నిర్వహిస్తారు.
మెయిన్ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగానే తుది ఎంపిక జాబితా ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష సెప్టెంబర్ 2026లో, మెయిన్ పరీక్ష నవంబర్ 2026లో జరిగే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, గుంటూరు/విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, చీరాల.. అలాగే తెలంగాణలోని హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.




