
పోస్టు భర్తీలో పైరవీల పర్వం?
నియామకంపై అనుమానాలెన్నో!
గార్లఒడ్డులో దేవస్థానం నియామకంపై దుమారం
నియామకం గుట్టు విప్పాలంటున్న గ్రామస్తులు
స్థానికేతరుడికి జూనియర్ అసిస్టెంట్ పోస్టు కట్టబెట్టారంటూ గ్రామస్తుల ఆరోపణలు.. విచారణకు డిమాండ్
సీకే న్యూస్ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఆగస్టు 15: ఏన్కూరు మండలం గార్లఒడ్డు గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జూనియర్ అసిస్టెంట్ పోస్టు భర్తీ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. గ్రామానికి సంబంధంలేని వ్యక్తిని కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించడంపై గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నియామక ప్రక్రియపై గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు.
కారేపల్లి నివాసి ఏ. శ్రీనివాస్‌ను జూనియర్ అసిస్టెంట్‌గా నియమించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో అర్హులైన వారు ఉన్నప్పటికీ స్థానికేతరుడికి అవకాశం ఎలా కల్పించారని వారు ప్రశ్నిస్తున్నారు. నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్, అర్హతలు, ఎంపిక విధానం, ఉత్తర్వులను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
నియామకంపై శ్రీనివాస్‌ను ప్రశ్నించగా, తాను బట్టి, వైరా ఎమ్మెల్యే మనిషినని చెప్పినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై శ్రీనివాస్, ఎమ్మెల్యే వర్గం నుంచి అధికారిక వివరణ రావాల్సి ఉంది.
ఇదిలా ఉండగా, ఈ నియామకం వెనుక పెద్ద మొత్తంలో నగదు చేతులు మారినట్లు గ్రామంలో ప్రచారం జరుగుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై తమకు స్పష్టమైన ఆధారాలు లేవని, అధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని కోరుతున్నారు.
దేవస్థానం వంటి ప్రజా విశ్వాసంతో ముడిపడిన సంస్థలో ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా జరగాలని గ్రామస్తులు పేర్కొన్నారు. నియామక ప్రక్రియలో నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు నియామకాన్ని పునఃపరిశీలించాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పూర్తి వివరాలను వెల్లడించాలని కోరారు.




