
నర్సంపేటలో తీవ్ర ఉద్రిక్తత… పెద్ది విగ్రహం తొలగింపు..
భగ్గుమన్న బీఆర్ ఎస్ శ్రేణులు
నర్సంపేట నియోజకవర్గంలో అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని అధికారులు తొలగించారు. ఈ పరిణామంపై బీఆర్ఎస్ భగ్గుమంది. అధికారుల చర్యకు వ్యతిరేకంగా తీవ్ర నిరసనలకు సిద్ధం కావడంతో పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
నర్సంపేట పట్టణంలోని మెడికల్ కళాశాల సమీపంలో మొన్నీమధ్యే పెద్ది విగ్రహం ఏర్పాటు చేశారు. అయితే తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య మున్సిపల్, రెవెన్యూ అధికారులు తొలగించారు. అనంతరం విగ్రహం ఏర్పాటు చేసిన గద్దెను కూడా నేలమట్టం చేశారు.
అనుమతులు లేకుండా ప్రభుత్వ అసైన్డ్ భూమిలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్న ఆరోపణల నేపథ్యంలోనే ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. విగ్రహం ఏర్పాటుకు సంబంధించి అవసరమైన అనుమతులు తీసుకోలేదని, ప్రభుత్వ భూమిలో నిర్మాణం చేపట్టినందున తొలగించినట్లు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు చెప్పారు. విగ్రహాన్ని తొలగించేందుకు అధికారులు అర్ధరాత్రి నుంచే చర్యలు ప్రారంభించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. విగ్రహం పరిసర ప్రాంతాల్లోకి ఎవరినీ అనుమతించకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. పోలీసుల భద్రత మధ్య అధికారులు విగ్రహాన్ని తొలగించి అక్కడి గద్దెను కూల్చివేశారు.
అయితే విగ్రహం తొలగింపు విషయం తెలియడంతో బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అర్ధరాత్రి సమయంలో భారీ పోలీసు బలగాలను మోహరించి విగ్రహాన్ని తొలగించడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా కీలకంగా ఉన్న పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని తొలగించడంతో నర్సంపేటలో ఉద్రిక్తత మరింత పెరిగింది. మొన్నీమధ్యే..
ఇంతకు ముందు ఇదే ప్రాంతంలో విగ్రహ ఏర్పాటు కోసం గద్దెను నిర్మించగా.. అధికారులు కూల్చేశారు. అయితే బీఆర్ఎస్ శ్రేణులు మళ్లీ అదే ప్రాంతంలో గద్దె కట్టి.. విగ్రహం ఏర్పాటు చేశాయి. విగ్రహం తొలగింపు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పరిసర ప్రాంతాల్లోకి ఎవరూ వెళ్లకుండా ఆంక్షలు విధించడంతో పాటు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అదనపు బలగాలను కూడా అందుబాటులో ఉంచినట్లు తెలుస్తోంది.
మరోవైపు, విగ్రహం తొలగింపుపై బీఆర్ఎస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. నర్సంపేటలో ప్రస్తుతం పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. విగ్రహం తొలగింపు వ్యవహారం స్థానికంగా రాజకీయ వివాదానికి దారితీసే అవకాశం ఉండటంతో అధికారులు, పోలీసులు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు.




