
వైద్యం చేయలేదని వీల్చైర్ పై ఎమ్మెల్యే ఇంటికి..పేషెంట్ను రెండు కిలోమీటర్లు తోసుకెళ్లిన కుటుంబీకులు
Web desc : మంచిర్యాల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్(జీజీహెచ్)లో వైద్యం చేయడం లేదని ఆరోపిస్తూ ఓ పేషెంట్‌ను కుటుంబసభ్యులు వీల్‌చైర్‌లోనే ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు ఇంటికి తీసుకెళ్లారు. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మందమర్రి మండలం పులిమడుగుకు చెందిన భూక్యా బుజ్జి(55) కిడ్నీ, పక్షవాతం సమస్యలతో బాధపడుతుండగా మంగళవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆమె కొడుకు భూక్యా రాజ్‌కుమార్, కుటుంబసభ్యులు ఆమెను మంచిర్యాల జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. అక్కడ నెఫ్రాలజిస్ట్ లేకపోవడంతో పాటు రాత్రి కావడంతో సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదని రాజ్‌కుమార్ ఆరోపించాడు.
అదే వీల్‌చైర్‌లో తల్లిని కూర్చోబెట్టుకుని రాత్రి 12.30 గంటలకు జీజీహెచ్ నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు ఇంటి వరకు తోసుకుంటూ వెళ్లారు. ఆర్‌ఎంవో శ్రీధర్ ఎమ్మెల్యే ఇంటికి చేరుకుని బుజ్జిని తిరిగి హాస్పిటల్‌కు తరలించారు. ఐసీయూలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం హయ్యర్ సెంటర్‌కు రెఫర్ చేశారు.
భూక్యా బుజ్జికి డయాలసిస్ కోసం ఫిస్టులా ఆపరేషన్ చేయించుకోవాలని గతంలోనే సూచించినప్పటికీ ఆమె చేయించుకోలేదని సూపరింటెండెంట్ అశోక్ తెలిపారు. ప్రొటోకాల్ ప్రకారం వెంటనే చికిత్స అందించామని, రాజ్‌కుమార్ మద్యం మత్తులో ఉండి సిబ్బంది, డాక్టర్లతో దురుసుగా ప్రవర్తించి హయ్యర్ సెంటర్‌కు తరలించే విషయంలో గొడవకు దిగారని ఆరోపించారు.




