
చికిత్స పొందుతూ కండక్టర్ ప్రవళిక మృ*తి…
Web desc : బస్సు టైర్ల కింద పడి తీవ్రంగా గాయపడి హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న మణుగూరు ఆర్టీసీ కండక్టర్ గుండ్ల ప్రవళిక (24) మంగళవారం రాత్రి మృతిచెందారు. గత నెల 25న మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో మౌనిక అనే ప్రయాణికురాలు తన కుమారుడితో కలిసి ఎక్కింది. భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలం మిట్టగూడెంలో దిగేందుకు తన కుమారుడికి హాఫ్ టికెట్ ఇవ్వాలని ఆమె కండక్టర్‌కు రూ.100 నోటు ఇచ్చింది.
చిల్లర విషయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదానికి దారితీసింది. మిట్టగూడెం స్టాప్‌లో ప్రయాణికురాలు దిగకుండా కండక్టర్ బస్సు డోర్ వద్ద నిలువరించింది. స్టాప్ దాటిపోతుండటంతో సదరు ప్రయాణికురాలు కండక్టర్‌ను నెట్టివేయగా ప్రవళిక రోడ్డుపై పడిపోగా ఆమె కుడికాలు పైనుంచి బస్సు వెనుక టైర్లు వెళ్లడంతో కాలు నుజ్జునుజ్జు అయ్యింది.
స్థానికంగా చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్‌లోగల సంజీవని హాస్పిటల్‌లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి కండక్టర్ ప్రవళిక మృతిచెందారు. కార్మికుల సంఘాల సంతాపం… కండక్టర్ ప్రవళిక మృతి పట్ల కార్మిక సంఘాల నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
తెలంగాణ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్, ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ)తోపాటు కార్మిక సంఘాల నాయకులు నివాళులర్పించారు. ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వం, ఆర్టీసీ సంస్థ సంయుక్తంగా కోటి రూపాయల పరిహారం చెల్లించాలని కోరారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ప్రవళికకు జోహార్లు అర్పిస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బస్సులు బంద్… కండక్టర్ ప్రవళిక మృతికి సంతాపం సూచకంగా బుధవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సు సర్వీసులను నిలిపివేయనున్నట్టు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ అధ్యక్షుడు పీ కమాల్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మర్రి నరేందర్, ప్రధాన కార్యదర్శి ఎండీ మౌలానా, ఎంప్లాయీస్ యూనియన్ నేతలు ఎస్ బాబు, ఈదురు వెంకన్న, తెలంగాణ మజ్దూర్ యూనియన్ నేతలు థామస్‌రెడ్డి, కమలాకర్‌గౌడ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ విధులు నిర్వహించనున్నట్టు వారు పేర్కొన్నారు.




