KhammamPoliticalTelangana

జీతం కావాలంటే రాజీనామా చేయాలంటూ సర్పంచ్ భర్త బెదిరింపులు!

జీతం కావాలంటే రాజీనామా చేయాలంటూ సర్పంచ్ భర్త బెదిరింపులు!

జాలమూడిలో దళిత కార్మికుడికి వేధింపుల పర్వం
జీతం కావాలంటే రాజీనామా చేయాలంటూ సర్పంచ్
సర్పంచ్ భర్త బెదిరింపులు – బాధితుడి ఆవేదన
కార్మికుడి జీతం చెక్కుపై సంతకం పెట్టని సర్పంచ్
జీతం ఇస్తాం కానీ ఉద్యోగం వదిలి వెళ్లిపో అంటూ ఒత్తిడి – తెర వెనుక భర్త ఆగడాలు

మధిర నవంబర్ 03(సికె న్యూస్) : మధిర మండలం జాలమూడి గ్రామపంచాయతీలో దారుణం వెలుగు చూసింది. గ్రామపంచాయతీలో పనిచేస్తున్న దళిత బహుళ ప్రయోజన కార్మికుడిని సర్పంచ్ తో పాటు సర్పంచ్ భర్త కూడా కులం పేరుతో దూషిస్తూ, జీతం కోసం వేధిస్తున్నారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

అసలేం జరుగుతోంది? జాలమూడి గ్రామపంచాయతీలో విధులు నిర్వహిస్తున్న బహుళ ప్రయోజన కార్మికుడు ప్రతిరోజూ పారిశుధ్య పనులతో పాటు పంచాయతీ అప్పగించిన పనులన్నీ చేస్తున్నారు. అయినా గత 11 నెలలుగా అతనికి జీతం అందడం లేదు.జీతం చెక్కుపై సర్పంచ్ సంతకం చేయడం లేదని, అసలు పంచాయతీ వ్యవహారాలన్నీ సర్పంచ్ భర్తే చూస్తున్నారని, ఆయనే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

చెక్కుపై సంతకం చేయమని అడిగితే సర్పంచ్ గారు, ఆమె భర్త కలిసి ‘నువ్వు దళితుడివి, నీ ఇష్టం వచ్చింది చేసుకో’ అంటూ కులం పేరుతో దూషిస్తున్నారు. నీ జీతం నీకు ఇస్తాం కానీ నువ్వు ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపో అంటూ ఇద్దరూ కలిసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. సర్పంచ్ భర్త పంచాయతీకి వచ్చి నన్ను బెదిరిస్తున్నారు” అని బాధిత కార్మికుడు ఆవేదన వ్యక్తం చేశారు.

సర్పంచ్ భర్త పెత్తనం ఏమిటి? ఎన్నికల్లో గెలిచింది భార్య అయితే, పాలన సాగిస్తున్నది భర్త అనే విమర్శలు జాలమూడిలో బలంగా వినిపిస్తున్నాయి. పంచాయతీ చెక్కుల నుంచి, పనుల కేటాయింపు వరకు అన్నీ సర్పంచ్ భర్తే నిర్ణయిస్తున్నారని, ప్రశ్నించే వారిని బెదిరిస్తున్నారని వార్డు సభ్యులు కూడా చెబుతున్నారు.

అధికారులు స్పందించాలి : ప్రభుత్వ నిబంధనల ప్రకారం సర్పంచ్ భర్తకు పంచాయతీ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం లేదు. అయినా భర్త అక్రమంగా జోక్యం చేసుకుంటూ దళిత కార్మికుడిని వేధించడం పట్ల దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఈ విషయంపై జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి వెంటనే స్పందించి, సర్పంచ్ తో పాటు అక్రమంగా పెత్తనం చెలాయిస్తున్న సర్పంచ్ భర్తపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బాధిత కార్మికుడికి న్యాయం చేయాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button