అదనపు కలెక్టర్‌ వర్సెస్‌ ఎమ్మెల్యే సంజయ్‌

అదనపు కలెక్టర్‌ వర్సెస్‌ ఎమ్మెల్యే సంజయ్‌;

By :  Ck News Tv
Update: 2025-03-21 05:22 GMT

అదనపు కలెక్టర్‌ వర్సెస్‌ ఎమ్మెల్యే సంజయ్‌


రాజకీయాల్లో మూర్ఖపు ఆలోచనలకు, స్వార్థ నిర్ణయాలకు తావు లేదంటూ జగిత్యాల అదనపు కలెక్టర్‌ వ్యాఖ్యానిస్తే..

ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల అవినీతి సంగతి అందరికి తెలుస్తూనే ఉందంటూ జగిత్యాల ఎమ్మెల్యేసంజయ్‌కుమార్‌ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. ప్రజాస్వామ్యంలో స్వార్థ రాజకీయాల గురించి అదనపు కలెక్టర్‌ స్పందించడం, అధికారుల అవినీతిపైన ఎమ్మెల్యే మాట్లాడటం పెద్ద చర్చకు దారితీసింది. జగిత్యాలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గురువారం వికసిత్‌ భారత్‌ ఆధ్వర్యంలో 'యంగ్‌ పార్లమెంట్‌’ నిర్వహించారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లత ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.

అదనపు కలెక్టర్‌ లత విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ రాజకీయాలు స్వార్థపూరితంగా మారిపోయాయని, ప్రజాస్వామ్యం సరిగా అమలు కావడం లేదని అన్నారు. ఢిల్లీ లాంటి చోట్ల జరుగుతున్న రాజకీయాలు కలుషితమయ్యాయని, ఇలాంటి అంశాలు రాష్ట్రంలోనూ కనిపిస్తున్నాయని తెలిపారు. రాజకీయాల్లో మూర్ఖపు ఆలోచనలు, స్వార్థ నిర్ణయాలకు తావు లేదని పేర్కొన్నారు. ఇదే సమయంలో వేదికపై ఉన్న ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ అదనపు కలెక్టర్‌ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. అక్కడే ఉన్న మీడియా మిత్రులు కవరేజ్‌ని నిలిపివేయాలని కోరారు. అదనపు కలెక్టర్‌ రాజకీయాల గురించి మాట్లాడటం సరికాదని అన్నారు.

Full View

ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు అవినీతికి పాల్పడుతున్న విషయం అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు. అధికారుల అవినీతిపై తాము సైతం మాట్లడవచ్చునంటూ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలతో కంగుతిన్న అదనపు కలెక్టర్‌ లత.. తన మాటల ఉద్దేశం అదికాదంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తదుపరి ఆమె మాట్లాడుతూ, తన మాటల్లో తప్పులు ఉంటే వెనక్కి తీసుకుంటున్నాని చెప్పారు. వేదికపైనే నెలకొన్న సంవాదంతో విద్యార్థులు, ఉపన్యాసకులు అందరూ ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలోనే తన ప్రసంగాన్ని ముగించిన అదనపు కలెక్టర్‌ సమావేశం ఉందంటూ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ ప్రసంగం కాకముందే వెళ్లిపోయారు.

Similar News