బ్యాంక్ అధికారుల వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం

బ్యాంక్ అధికారుల వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం;

By :  Ck News Tv
Update: 2025-03-16 06:32 GMT


బ్యాంక్ అధికారుల వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం

పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్న వ్యాపారి కుటుంబసభ్యులు

ప్రైవేట్‌ దవాఖానకు తరలింపు

వరంగల్‌ చౌరస్తా : బ్యాంకు అధికారులు వేధిస్తున్నారని ఓ వ్యాపారి కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన శనివారం వరంగల్‌ చౌరస్తాలో చోటుచేసుకుంది.

బాధితులు, స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్‌కు చెందిన చెలుపూరు ఆనంద్‌కుమార్, హేమకుమార్‌ అన్నదమ్ములు. వారికి జేపీఎన్‌రోడ్డులో సొంత భవనం ఉండగా.. అందులో వస్త్ర దుకాణం నిర్వహిస్తున్నారు.

ఆనంద్‌కుమార్, హేమకుమార్‌ల పిల్లల(హరీశ్, శశికిరణ్‌) పేరిట నగరంలోని ఓ బ్యాంకులో వస్త్ర దుకాణం నిర్వహిస్తున్న భవనం తనఖా పెట్టి 2017లో రూ.1.20 కోట్ల రుణం తీసుకున్నారు.

కిస్తీలు కట్టే విషయంలో వివాదం తలెత్తడంతో బ్యాంకు అధికారులు, వస్త్ర దుకాణం యజమానులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానం అడ్వొకేట్‌ కమిషన్‌ ఏర్పాటు చేయగా.. బ్యాంకుకు అనుకూలంగా ఆదేశాలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో శనివారం అడ్వొకేట్ కమిషన్, బ్యాంకు అధికారులు భవనాన్ని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లారు. ఉదయమే వేలం పాటలో ఒకరు ఈ భవనాన్ని దక్కించుకున్నారు.

అయితే, బ్యాంకు వద్దకు చేరుకున్న సదరు వస్త్ర దుకాణం యజమానులు, వారి కుటుంబసభ్యులు.. నోటీసులు ఇవ్వకుండా తమ భవనాన్ని వేలంలో విక్రయించడం సరికాదని పేర్కొన్నారు.

కనీసం 10 రోజులు గడువు కావాలని అడిగినప్పటికీ పట్టించుకోలేదని, కావాలని తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. భవనం చేజారుతుందనే ఆందోళనతో బ్యాంకు ఎదుట ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పు అంటించుకున్నారు.

ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో జేపీఎన్‌ రోడ్డులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్థానికులు స్పందించి ఆనంద్‌కుమార్, తేజస్వి(హేమకుమార్‌ కోడలు), ప్రశాంత్‌(ఆనంద్‌కుమార్‌ అల్లుడు)కు అంటుకున్న మంటలను ఆర్పివేశారు.

వారిని పోలీసుల సాయంతో వెంకట్రామ కూడలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

Full View

తేజస్వి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆనంద్‌కుమార్‌కు 35 శాతం గాయాలు కాగా హేమకుమార్, ప్రశాంత్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే, 'తాము ఆత్మహత్యకు యత్నించలేదని..

బ్యాంకు వేలంపాటలో తమ భవనం కొనుగోలు చేసిన సంపత్‌కుమార్, అతని కుమారులు దాడి చేసి పెట్రోల్‌ పోసి నిప్పు అంటించారు' అని ఆనంద్‌కుమార్‌ కోడలు సృజన ఆరోపించారు.

సంపత్‌కుమార్‌ కొంతమంది ప్రైవేటు వ్యక్తులతో దుకాణం వద్దకు వచ్చి బెదిరించారని హేమకుమార్‌ తెలిపారు. ఘటనా స్థలంలో పోలీసులు ఉన్నప్పటికీ పరిస్థితిని అదుపు చేయడంలో విఫలమయ్యారు.

ఈ ఘటనపై ఇంతేజార్‌గంజ్‌ ఠాణా సీఐ షుకూర్‌ను వివరణ కోరగా.. ఫిర్యాదు అందలేదన్నారు. బాధితులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామన్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు.

Similar News