Uncategorized
Trending

అధిక వడ్డీ ఆశ చూపి..150 కోట్లకు టోపీ

అధిక వడ్డీ ఆశ చూపి..150 కోట్లకు టోపీ

అధిక వడ్డీ ఆశ చూపి..150 కోట్లకు టోపీ

హైదరాబాద్ నగరంలో మరొక భారీ మోసం వెలుగు చూసింది.. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో ఏకంగా 150 కోట్ల రూపాయలను కొట్టేశారు.. ది పెంగ్విన్ సెక్యూరిటీస్ పేరుతో జీడిమెట్లలో ఏర్పాటు చేసిన సంస్థ కుచ్చు టోపీ పెట్టింది.. పెట్టుబడి పెట్టిన సొమ్ముకు రెట్టింపు డబ్బులు ఇస్తామని ఆశచూపి ది పెంగ్విన్ సెక్యూరిటీస్‌ సంస్థ టోకరా వేసింది. మూడు నెలలుగా రిటర్న్స్‌ ఇవ్వకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితులు శుక్రవారం జీడిమెట్ల పీఎస్‌లో ఫిర్యాదు చేసేందుకు క్యూ కట్టారు. సదరు సంస్థ చేతిలో మోసపోయిన బాధితులు ఇప్పటికే 13 మంది ఫిర్యాదు చేయగా రూ.6.5కోట్ల మోసం జరిగినట్లు తెలిసింది.

బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. బాధితులు, జీడిమెట్ల ఇన్‌స్పెక్టర్‌ గడ్డం మల్లేష్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. గిరినగర్‌కు చెందిన బాలాజీ, మెదక్‌ జిల్లా, అల్లాదుర్గ్‌ ప్రాంతానికి చెందిన స్వాతి మూడేళ్ల క్రితం చింతల్‌ గణేష్‌ నగర్‌లోని ఓ కాంప్లెక్స్‌లో ది పెంగ్విన్ సెక్యూరిటీస్‌ పేరుతో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తమ సంస్థలో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలిస్తామంటూ ప్రచారం చేసుకున్నారు.

పెట్టుబడి పెట్టిన వారికి రూ.100 స్టాంప్‌ పెపర్లపై నోట్‌ రాసి ఇవ్వడంతో చాలా మంది వారిని నమ్మారు. కొందరు వీరి వద్ద పెట్టుబడి పెట్టగా వారు ఇచ్చిన మొత్తానికి 20నెలల్లో రెట్టింపు డబ్బులు చెల్లించారు. చిన్న మొత్తాలు పెట్టుబడిగా పెట్టిన ఇన్వెస్టర్లు లాభం ఇస్తున్నారని నమ్మి డబ్బు పెద్ద మొత్తంలో పెట్టడమే గాక ఇతరులతో పెట్టించారు. సదరు సంస్థవారు ఇతరులతో పెట్టుబడులు పెట్టిస్తే వారికి 5శాతం కమీషన్‌ సైతం ఇచ్చేవారు. దీంతో వారు తమ వ్యాపారాన్ని విస్తరించి మూడే బ్రాచీలను ఏర్పాటు చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచే గాక రాష్ట్ర వ్యాప్తంగా ఇతర జిల్లాలకు చెందిన ప్రజలు సైతం పెట్టుబడులు పెట్టారు. అయితే గత మూడు నెలలుగా సదరు సంస్థ ఇన్వెస్టర్లకు చెల్లింపులు ఆపేసింది.

ఈ విషయమై పలువురు సంస్థ కార్యాలయానికి వచ్చి ప్రశ్నించగా ఈనెల షేర్‌ మార్కెట్‌ బాగాలేదు త్వరలోనే చెల్లిస్తామని చెప్పారు. శుక్రవారం డబ్బులు చెల్లిస్తామని చెప్పడంతో కొందరు ఇన్వెస్టర్లు కార్యాలయానికి వచ్చారు. అప్పటికే ఆఫీసుకు తాళం వేసి ఉండటంతో నిర్వాహకులను ఫోన్‌ చేయగా ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో తాము మోసపోయినట్లు గుర్తించిన బాధితులు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో పోలీసులు డిపాజిట్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. బాధితులు సంఖ్య పెరిగితే కేసును ఈవోడబ్ల్యూఎస్‌కు బదిలీ చేస్తామని పోలీసులు తెలిపారు. కాగా 1500 మందికి పైగా సదరు సంస్థలో రూ.100 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. నిందితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button