Khammam
Trending

ఏన్కూరులో మురుగు నీటి ముప్పు.

ఏన్కూరులో మురుగు నీటి ముప్పు.. చెరువును తలపిస్తున్న సందు!

ఫిర్యాదులు చేసినా స్పందించని అధికారులు

అధికారుల నిర్లక్ష్యంతో ప్రజల ఆరోగ్యం గాలిలో..

సికే న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు జనవరి 27 2026:ఖమ్మం జిల్లా ఏన్కూరు మండల కేంద్రంలో మురుగు నీటి సమస్య తీవ్రంగా మారింది.స్థానికంగా ముత్తూట్ ఫైనాన్స్ ఆఫీసు ఎదురుగా ఉన్న సందులో సుమారు 9 గృహాలకు సంబంధించిన వాడుక నీరు సరైన డ్రైనేజీ లేకపోవడంతో నేరుగా రోడ్లపైకి పారుతోంది.
ఇళ్ల నుంచి వెలువడుతున్న మురుగు నీరు సందు మొత్తం నిల్వ ఉండటంతో ఆ ప్రాంతం మొత్తం చెరువును తలపించేలా మారింది. రోజురోజుకు నీరు ఎక్కువగా నిల్వ ఉండటంతో దుర్వాసనతో పాటు దోమలు, ఈగలు విపరీతంగా పెరిగి స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ పరిస్థితుల వల్ల డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు వంటి రోగాలు వ్యాపించే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
ఈ సమస్యను పలు మార్లు గ్రామపంచాయతీ అధికారులకు, మండల స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో ప్రజల సహనం ఓడిపోతుందని చెబుతున్నారు.
ఇకనైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి తక్షణమే డ్రైనేజీ ఏర్పాటు చేసి, మురుగు నీటి సమస్యను పరిష్కరించాలని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button