
రోడ్డు కావాలి… కానీ ఇళ్లు కూల్చొద్దు
ఇళ్లను కూల్చే మార్గమే ఎందుకు? ప్రత్యామ్నాయాలు కనిపించవా?
రోడ్డు కోసం ఇళ్ల బలి? రేపల్లెవాడలో పెరుగుతున్న వ్యతిరేకత
సికే న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు ఏప్రిల్ 15 2026: మండల పరిధిలోని రేపల్లెవాడ గ్రామంలో ప్రతిపాదిత రోడ్డు నిర్మాణం గ్రామ ప్రజల్లో తీవ్ర ఆందోళనకు దారి తీసింది. ఏన్కూరు నుండి నాచారం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు మంజూరైన ఈ రోడ్డు అభివృద్ధికి ప్రతీకగా భావించిన ప్రజలు, ప్రస్తుతం అదే ప్రాజెక్టు తమ ఇళ్లకు ముప్పుగా మారుతుందనే భయంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుత ప్రణాళిక ప్రకారం రోడ్డు గ్రామం మధ్యగానే వెళ్లేలా రూపకల్పన చేయడంతో, అనేక ఇళ్లపై ప్రభావం పడే పరిస్థితి నెలకొంది. దశాబ్దాలుగా అక్కడే నివసిస్తూ జీవనాధారాలు ఏర్పరచుకున్న కుటుంబాలు తమ నివాసాలను కోల్పోయే ప్రమాదంలో ఉండటం గ్రామస్థుల్లో అసంతృప్తిని పెంచుతోంది. చిన్న చిన్న పిల్లలతో ఉన్న కుటుంబాలు, వృద్ధులు, కూలీ కార్మికులు తమ భవిష్యత్తు ఏమవుతుందోనన్న ఆందోళనలో ఉన్నారు.
ఇక మరింత కారణమైన అంశం ఏమిటంటే, ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన విషయంపై ఇప్పటివరకు గ్రామ ప్రజలకు ఎలాంటి అధికారిక నోటీసులు గానీ, నోటిమాట గానీ తెలియజేయలేదని వారు ఆరోపిస్తున్నారు. “మా ఇళ్ల మీదుగా రోడ్డు వేయాలనుకుంటే కనీసం ముందుగా సమాచారం ఇవ్వాలి కదా… ఒక్కసారిగా ఇలా ప్రణాళిక తీసుకురావడం అన్యాయం” అంటూ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
“రోడ్డు నిర్మాణానికి మేము వ్యతిరేకం కాదు. కానీ మా ఇళ్లను కూల్చి అభివృద్ధి చేయడం అన్యాయం. ప్రభుత్వం మా పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలి” అని గ్రామస్థులు స్పష్టంగా చెబుతున్నారు. కొందరు ప్రజలు ప్రత్యామ్నాయంగా గ్రామం పక్కగా రోడ్డు మళ్లించే అవకాశాలు ఉన్నాయని సూచిస్తూ, అధికారుల నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమస్యపై గ్రామంలో పలుమార్లు సమావేశాలు నిర్వహించిన ప్రజలు, ఏకగ్రీవంగా రోడ్డు మార్గాన్ని మార్చాలని నిర్ణయించారు. అనంతరం మండల తహసీల్దార్, మండల అభివృద్ధి అధికారికి వినతి పత్రాలు సమర్పించి, ప్రస్తుత మార్గాన్ని వెంటనే పునఃపరిశీలించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఎటువంటి నష్టం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాన్ని గుర్తించి అమలు చేయాలని, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు.ఇదిలా ఉండగా, అధికారుల నుంచి ఇంకా స్పష్టమైన హామీ రాకపోవడం ప్రజల్లో అనిశ్చితిని పెంచుతోంది. సమస్య పరిష్కారం కాకపోతే పెద్దఎత్తున ఆందోళనలకు దిగే అవకాశముందని గ్రామ పెద్దలు హెచ్చరిస్తున్నారు. అవసరమైతే రోడ్డు పనులను అడ్డుకునే దిశగా కూడా ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని వారు స్పష్టం చేస్తున్నారు.
అభివృద్ధి పనులు ప్రజల సంక్షేమానికి దోహదపడాలి గానీ, వారి జీవనాధారాలను ప్రమాదంలోకి నెట్టే విధంగా ఉండకూడదని స్థానికులు స్పష్టంగా చెబుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ సముచిత నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది ఇప్పుడు కీలకంగా మారింది.




