
అధికారుల పర్యవేక్షణ ఎక్కడ?
పాఠశాలను పట్టించుకునే నాథుడే లేడు: తుడుందెబ్బ
కామారం గ్రామంలోనే ఆశ్రమ పాఠశాలను కొనసాగించాలని డిమాండ్
స్పందించకుంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరిక
సీకే న్యూస్ గంగారం మండల (పతినిధి దుర్గం మురళి నేత
మహబూబాబాద్: గంగారం::: కామరాం గ్రామంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను ఇతర ప్రాంతానికి తరలించకుండా అదే గ్రామంలో కొనసాగించాలని తుడుందెబ్బ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు కుంజ నర్సింగరావు ప్రభుత్వాన్ని కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న గిరిజన ఆశ్రమ పాఠశాలకు తగిన సంఖ్యలో ఉపాధ్యాయులను నియమించకపోవడంతో పాటు, ఉన్నతాధికారుల పర్యవేక్షణ కూడా పూర్తిగా కొరవడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలను పట్టించుకునే నాధుడే లేకపోవడంతో విద్యా ప్రమాణాలు దెబ్బతిన్నాయని అన్నారు. ఆదివాసీ విద్యార్థుల సంఖ్య తగ్గడానికి అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని పేర్కొన్న ఆయన, ఈ పరిస్థితిని సరిదిద్దాల్సిన అధికారులు చర్యలు తీసుకోకుండా విద్యార్థుల సంఖ్య తగ్గిందనే సాకుతో పాఠశాలను మరో మండలానికి తరలించాలని యోచించడం సరికాదన్నారు.
పాఠశాలను తరలించే బదులు ఉన్నతాధికారుల పర్యవేక్షణను పెంచి కామరాం గ్రామంలోనే పాఠశాలను కొనసాగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లేకపోతే ప్రజలను కలుపుకుని ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు కుంజ నర్సింగరావు హెచ్చరించారు.




