
పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపులు..
web desc : దేశంలోని అత్యున్నత పోలీసు శిక్షణా సంస్థగా పేరొందిన హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిని లైంగికంగా వేధించాడనే ఆరోపణలపై ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిపై అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. నిందితుడు కొంతకాలంగా తనకు అసభ్యకరమైన సందేశాలు పంపుతూ మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని పేర్కొన్నారు. తన అనుమతి లేకుండా తన పర్సనల్ వీడియోలు చిత్రీకరించి వాటితో బెదిరింపులకు పాల్పడినట్లు కూడా ఆమె ఆరోపించారు.
ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఈనెల 9వ తేదీన నిందితుడు తనను బలవంతంగా గదిలోకి లాక్కెళ్లినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత మెడపై కత్తి పెట్టి బెదిరించాడని బాధితురాలు తెలిపింది. ఆ తర్వాత తన ప్రైవేట్ వీడియోలు రికార్డు చేసి, సెల్ ఫోన్‌ను తీసుకుని ఆ వీడియోలను తన భర్తకు వాట్సాప్ ద్వారా పంపించాడని ఆరోపించింది. ఈ ఘటనతో తాను తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని ఆమె పేర్కొన్నారు.
బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా అత్తాపూర్ పోలీసులు రంగంలోకి దిగారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని పలు సెక్షన్లతో పాటు ఐటీ చట్టంలోని సెక్షన్ 66(సీ) కింద కేసు నమోదు చేశారు. నిందితుడి వాంగ్మూలాన్ని నమోదు చేసి.. కేసుకు సంబంధించిన డిజిటల్ ఆధారాలను సేకరించే ప్రక్రియను పోలీసులు ప్రారంభించారు.
ఈ ఘటనపై నేషనల్ పోలీస్ అకాడమీ వర్గాలు ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. అయితే దేశంలో అత్యున్నత స్థాయి పోలీసు అధికారులకు శిక్షణ ఇచ్చే ఇలాంటి సంస్థలోనే ఈ ఆరోపణలు వెలుగులోకి రావడం పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఫిర్యాదులో చేసిన ఆరోపణలపై విచారణ పూర్తయ్యే వరకు అవి ఆరోపణలుగానే పరిగణించాల్సి ఉంటుంది. దర్యాప్తులో లభించే ఆధారాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు.




