
ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ ఉద్యోగాల నియామకంలో అక్రమాలు
అర్హత లేని వారికి ఉద్యోగలిచ్చారు….
— విచారణ జరిపి న్యాయం చేయాలి
దగ్గుబాటి సామ్రాజ్యం
సి కే న్యూస్ చింతకాని ప్రతినిధి.
ఖమ్మం, జూలై 23 :
చింతకాని మండలం వందనం గ్రామంలో జరిగిన ఫ్రీ ప్రైమరీ ఇన్స్ట్రుక్టర్ ఉద్యోగాల నియామక ప్రక్రియలో తనకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆ గ్రామానికి చెందినాఫ్ దగ్గుబాటి సామ్రాజ్యం ఆవేదన వ్యక్తం చేశారు. అర్హతలు ఉన్నప్పటికీ తనను పక్కనపెట్టి, అర్హత లేని, తక్కువ అర్హతలు కలిగిన ఇతర వ్యక్తులకు ఉద్యోగాలు కట్టబెట్టారని ఆమె ఆరోపించారు. ఖమ్మం లోని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సామ్రాజ్యం మాట్లాడుతూ ఉద్యోగాల ఎంపిక విషయంలో గ్రామ అధికార పార్టీ నాయకులు, సంబంధిత ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై వ్యవహరించినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఇంటర్వ్యూ పేరుతో అభ్యర్థులను రోజుల తరబడి కాలయాపన చేయించి, చివరకు నిబంధనలకు అనుగుణంగా ఇంటర్వ్యూ కూడా నిర్వహించలేదని ఆరోపించారు. కేవలం ఒక నిమిషం పాటు ఇంటర్వ్యూ నిర్వహించి, అభ్యర్థుల అర్హతలు, విద్యార్హతలు, అనుభవాన్ని సరిగా పరిశీలించకుండా ఉద్యోగాలకు ఎలా ఎంపిక చేశారని ఆమె ప్రశ్నించారు. ఇంటర్మీడియట్ కనీస అర్హతగా ఉన్నప్పటికీ, దానికంటే ఎక్కువ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులను పక్కనపెట్టి, స్థానిక నాయకులకు నచ్చిన వారికి ఇష్టారాజ్యంగా ఉద్యోగాలు కట్టబెట్టారని ఆరోపించారు. ఈ నియామకాల విషయంలో డబ్బులు చేతులు మారినట్లు తమకు అనుమానంగా ఉందన్నారు. ఉద్యోగాల నియామకానికి సంబంధించిన దరఖాస్తులు, అభ్యర్థుల అర్హతలు, ఇంటర్వ్యూ ప్రక్రియ, ఎంపిక జాబితా, అధికారుల పాత్రపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని ఆయన కోరారు. అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని, అర్హత కలిగిన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంపై సంబంధిత ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి తగిన విచారణ జరపాలి. నాకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది న్యాయం చేయాలి. ఉద్యోగాల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా మళ్లీ పరిశీలించాలి” అంటూ డిమాండ్ చేశారు….




