Khammam
Trending

సీతారామ జలాలు పరాయివే..!

సీతారామ జలాలు పరాయివే..!

సీతారామ జలాలు పరాయివే..!

భూములిచ్చిన రైతుకు నీటి చుక్క కరువు

ఏన్కూరుకు ప్రాజెక్టు… ప్రయోజనం శూన్యం!

సీకే న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు జూలై 23 2026: ఒకవైపు ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని అధికారులు రైతులను అప్రమత్తం చేస్తూ ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచిస్తున్నారు. మరోవైపు, గోదావరి జలాలను అందిస్తామని భారీ ఆశలు కల్పించిన సీతారాం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏన్కూరు మండల రైతులకు మాత్రం ఇప్పటికీ ఆశించిన ప్రయోజనం చేకూర్చలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రాజెక్టు నిర్మాణం కోసం మండలంలోని కొన్ని ఎకరాల సారవంతమైన వ్యవసాయ భూములు కోల్పోయిన రైతులు, నేడు సాగునీటి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొనిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంగారం పండే మా భూములను ప్రభుత్వానికి ఇచ్చాం… కానీ నేడు మా పొలాలకు ఒక్క చుక్క నీరు కూడా రాలేదు అని రైతులు ప్రశ్నిస్తున్నారు.
రైతుల ఆశలు సాగునీటిపైనే ఉన్నా, సీతారాం కాలువ ద్వారా వచ్చే నీటిని వైరా, సత్తుపల్లి, మధిర తదితర ప్రాంతాలకు మళ్లిస్తున్నారని, ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన ఏన్కూరు మండలాన్ని మాత్రం పూర్తిగా విస్మరించారని ఆరోపిస్తున్నారు. తమ ప్రాంతం మీదుగా కాలువ వెళ్లినా, తమ పొలాలకు మాత్రం నీరు అందకపోవడం అన్యాయమని అంటున్నారు.
అంతేకాకుండా కాలువకు పూర్తిగా సీసీ లైనింగ్ నిర్మించడంతో నీరు భూమిలోకి ఇంకే అవకాశం లేకుండా పోయిందని, దీంతో భూగర్భ జలాలు పెరగలేదని రైతులు చెబుతున్నారు. బోర్లు, బావుల్లో నీటి మట్టం పెరగకపోవడంతో సాగు మరింత కష్టసాధ్యంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాలువలో ప్రవహించే నీటిని పశువులు తాగేందుకు గానీ, గ్రామాల అవసరాలకు వినియోగించుకునేలా గానీ ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రాజెక్టు తమ ప్రాంతం గుండా వెళ్తున్నా, ప్రయోజనం మాత్రం ఇతర ప్రాంతాలకే పరిమితమైందని విమర్శిస్తున్నారు.
ఇదే సమయంలో ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చని అధికారులు హెచ్చరిస్తూ, నీటి లభ్యత తక్కువగా ఉండే పరిస్థితుల్లో జాగ్రత్తగా వ్యవసాయం చేయాలని రైతులకు సూచిస్తున్నారు. అయితే, గోదావరి జలాలను అందించేందుకు నిర్మించిన సీతారాం ప్రాజెక్టు నీరు స్థానిక రైతులకు అందితే ఇలాంటి పరిస్థితులను కొంతవరకు అధిగమించే అవకాశం ఉండేదని రైతులు అభిప్రాయపడుతున్నారు.
ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన రైతులకు ప్రత్యేక సాగునీటి ప్రణాళిక రూపొందించాలని, ఏన్కూరు మండల ఆయకట్టు భూములకు వెంటనే సాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాలువ వెంట అవసరమైన చోట్ల అవుట్‌లెట్లు, పంపిణీ వ్యవస్థలు ఏర్పాటు చేసి స్థానిక రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
“భూములు మా నుంచి తీసుకున్నారు… నీరు మాత్రం మాకు ఇవ్వలేదు. సీతారాం ప్రాజెక్టు వల్ల ఏన్కూరు రైతులకు కలిగిన ప్రయోజనం ఏమిటో ప్రభుత్వం సమాధానం చెప్పాలి” అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button