
ఎంబీబీఎస్ రెండో విడత కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు అన్ ఎయిడెడ్ నాన్ మైనార్టీ, మైనార్టీ మెడికల్ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను కాంపిటెంట్ అథారిటీ కోటా కింద మిగిలిన ఖాళీలు, అదనంగా పెరిగిన ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం రెండో విడత వెబ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
మహబూబ్‌నగర్‌లోని ఎస్‌వీఎస్ మెడికల్ కాలేజ్, వికారాబాద్‌లోని మహావీర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లలో సీట్ల సంఖ్య 200 నుంచి 250కి పెరిగినట్లు వర్సిటీ వెల్లడించింది. ఈ అదనపు సీట్లతో పాటు తొలి విడత తర్వాత మిగిలిన ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి వెబ్ ఆప్షన్లను ఆహ్వానిస్తోంది.
తుది మెరిట్ జాబితాలో పేర్లు ఉన్న అభ్యర్థులు (ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, పీఎంసీ, సీఏపీ కేటగిరీలతో సహా) శుక్రవారం సాయంత్రం 4:30 గంటల నుంచి సెప్టెంబర్ 14న మధ్యాహ్నం 1:00 గంట వరకు అధికారిక వెబ్‌సైట్ (https://tsmedadm.tsche.in/) ద్వారా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని వర్సిటీ తెలిపింది. అనంతరం సెప్టెంబర్ 15న సీట్లను కేటాయించనున్నారు.
వీరికి మాత్రమే అవకాశం.. తొలి విడత కౌన్సెలింగ్‌లో సీటు పొంది, కళాశాలలో చేరి ప్రస్తుతం కోర్సు కొనసాగిస్తున్న అభ్యర్థులు స్లైడింగ్ కోసం ఈ విడతలో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని వర్సిటీ స్పష్టం చేసింది. అయితే, మొదటి విడతలో సీటు వచ్చి చేరని వారు, చేరిన తర్వాత మానుకున్నవారు, అసలు మొదటి విడతలో వెబ్ ఆప్షన్లే నమోదు చేయని విద్యార్థులు ఈ రెండో విడత కౌన్సెలింగ్‌కు అనర్హులని పేర్కొంది.
రెండో విడతలో కొత్తగా సీటు అలాట్ అయితే, మొదటి విడతలో పొందిన సీటు ఆటోమేటిక్‌గా రద్దవుతుందని స్పష్టం చేసింది. ఎంపికైన విద్యార్థులు యూనివర్సిటీ ఫీజు కింద రూ. 12,000 ఆన్‌లైన్ ద్వారా చెల్లించి అలాట్‌మెంట్ ఆర్డర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మొదటి విడతలోనే ఫీజు చెల్లించి, ఈ విడతలో స్లైడింగ్ అయిన అభ్యర్థులు మళ్లీ యూనివర్సిటీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది.
వెబ్ ఆప్షన్ల ప్రక్రియలో సాంకేతిక సమస్యలు ఎదురైతే 9392685856, 7842136688 నంబర్లను, నిబంధనల సందేహాలకు 7901098840, 9490585796 నంబర్లను సంప్రదించాలని వర్సిటీ అధికారులు సూచించారు. కాగా, మేనేజ్‌మెంట్ కోటా మొదటి విడత సీట్ల కేటాయింపును సెప్టెంబర్ 16న విడుదల చేయనున్నట్లు వర్సిటీ వెల్లడించింది.




