
పాతబస్తీలో దారుణం.. భార్యపై భర్త, ముగ్గురు స్నేహితుల సామూహిక అత్యాచారం
Web desc : హైదరాబాద్ నగరంలోని కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర దిగ్భ్రాంతి కలిగించే అమానుష ఘటన వెలుగుచూసింది. ఓ యువతిపై స్వయంగా భర్తే తన స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణ ఉదంతం తీవ్ర కలకలం రేపింది.పోలీసుల ప్రాథమిక వివరాల ప్రకారం.. బంగ్లాదేశ్‌కు చెందిన 18 ఏళ్ల యువతికి కశ్మీర్ ప్రాంతానికి చెందిన ఫయాజ్ అనే వ్యక్తితో గతంలో వివాహం జరిగింది.
పెళ్లయిన అనంతరం వారు జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్ నగరానికి వచ్చి కంచన్‌బాగ్ పరిసరాల్లో నివాసం ఉంటున్నారు. అయితే మద్యానికి బానిసైన భర్త ఫయాజ్, తన స్నేహితులైన ముజీబ్, కమల్, రెహమాన్‌లతో కలిసి భార్యను ఇంట్లోనే నిర్బంధించి శారీరకంగా, మానసికంగా తీవ్ర చిత్రహింసలకు గురి చేశారు.ఈ క్రమంలో భర్తతో పాటు అతని ముగ్గురు స్నేహితులు ఆమెపై దారుణంగా సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.
కాగా ఇంటి రెంట్ వసూల్ చేయడానికి వెళ్లిన యజమాని తాళం పగలకొట్టగా.. బాధితురాలు ఇంటి నుంచి బయటకు వచ్చింది. దీంతో అసలు విషయం బయటపడింది. అనంతరం బాధితురాలు పోలీసులను ఆశ్రయించి తనపై జరిగిన దారుణాలపై ఫిర్యాదు చేసింది.
ఆమె వాంగ్మూలం ఆధారంగా భర్త ఫయాజ్ సహా అతడికి సహకరించిన ముగ్గురు స్నేహితుల పై సామూహిక అత్యాచారం, అక్రమ నిర్బంధం, శారీరక దాడి తదితర తీవ్ర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించామని, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పోలీస్ అధికారులు వెల్లడించారు.




