
ప్రైవేటు ట్రావెల్స్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి..
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నిర్లక్ష్యం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. బస్సు లగేజ్ డోర్ తెరిచి ఉండటంతో రోడ్డు పక్కన బైక్‌పై కూర్చున్న సింగరేణి ఉద్యోగి మృత్యువాత పడ్డాడు.
ఈ విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని నవభారత్ సెంటర్‌లో మంగళవారం తెల్లవారుజామున సుమారు 5 గంటలకు చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నవభారత్‌కు చెందిన సతీష్‌రెడ్డి (40) ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే.. నవభారత్‌కు చెందిన సతీష్‌రెడ్డి సింగరేణి సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మంగళవారం తెల్లవారుజామున టీ తాగేందుకు నవభారత్ సెంటర్‌కు వచ్చిన సతీష్‌రెడ్డి, రోడ్డు పక్కన తన బైక్‌ను నిలిపి టీ తాగాడు. అనంతరం ఇంటికి వెళ్లేందుకు బైక్‌పై కూర్చుంటున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నుంచి భద్రాచలం వైపు వెళ్తున్న బీఎస్‌ఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లగేజ్ డోర్ తెరిచి ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో బస్సు ముందుకు కదులుతుండగా తెరిచి ఉన్న లగేజ్ డోర్ సతీష్‌రెడ్డి తలకు బలంగా తగిలింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.
కళ్లముందే జరిగిన ఈ ఘటనతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రమాద సమాచారం అందుకున్న పాల్వంచ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బస్సు లగేజ్ డోర్ తెరిచి ఉండటానికి గల కారణాలు, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇద్దరు కుమార్తెలు ఉన్న సతీష్‌రెడ్డి అకాల మరణంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబానికి అండగా నిలిచిన వ్యక్తి దూరం కావడంతో బంధువులు, స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు.




