
ఏన్కూర్ లో గ్యాస్ పేరుతో హోటల్లు నిలువు దోపిడీ
30 నుంచి 50 రూపాయలకు పెరిగిన టిఫిన్ ప్లేటు ధరలు
హోటల్ రేట్ల పెంపుపై అధికారుల నిర్లక్ష్యం?
హోటల్ యజమానుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజల డిమాండ్
సికే న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు మార్చి 19 2026: ఏన్కూర్ మండల కేంద్రంలో గ్యాస్ కొరత పేరుతో కొంతమంది హోటల్ యజమానులు వినియోగదారులపై అధిక భారం మోపుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
గతంలో 30 రూపాయలకు లభించిన టిఫిన్ ప్లేట్లు ప్రస్తుతం 40 నుంచి 50 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్యాస్ బండ్ల ధరలు పెరిగాయని, బ్లాక్‌లో కొనుగోలు చేయాల్సి వస్తోందని చెప్పి ఒక్కో ప్లేటుకు ఏకంగా 20 రూపాయల వరకు ధర పెంచి వసూలు చేస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.
టిఫిన్ ధరల పెంపుపై ప్రశ్నించిన వినియోగదారులకు “మా దగ్గర టిఫిన్ లేదు” అంటూ సమాధానం ఇస్తున్నారని కూడా పలువురు చెబుతున్నారు. దీంతో సామాన్య ప్రజలు టిఫిన్ సెంటర్లలో తినే పరిస్థితి లేకుండా పోయిందని వాపోతున్నారు. ఇడ్లీ, గారే, దోశ వంటి టిఫిన్ ఐటంల ధరలను అమాంతంగా పెంచి అమ్ముతున్నా సంబంధిత రెవెన్యూ అధికారులు, సివిల్ సప్లై అధికారులు ఇప్పటివరకు ఎలాంటి దాడులు నిర్వహించలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇంట్లో వాడుకునే గ్యాస్ సిలిండర్లు మార్కెట్లో దొరకని పరిస్థితి ఉన్నప్పుడు హోటల్ యజమానులకు గ్యాస్ ఎక్కడి నుంచి వస్తోందో చెప్పాలని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అక్రమంగా గ్యాస్ బండలు సేకరించి అధిక ధరలకు టిఫిన్ విక్రయిస్తున్న హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికైనా జిల్లా సివిల్ సప్లై అధికారులు రంగంలోకి దిగి ఏన్కూర్‌లో అధిక రేట్లకు టిఫిన్ విక్రయిస్తున్న హోటళ్లపై దాడులు నిర్వహించి గ్యాస్ బండ్లను స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి హోటల్ యజమానుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ఈ ప్రాంత ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.



