
కాలేజీకి వెళ్లిన యువతి మిస్సింగ్…
కాలేజీకి వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన ఘటన బేగం బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై మీరా కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ధూల్‌పేట్ కుమార్వాడి ప్రాంతానికి చెందిన ఎస్.రాజ్ కుమార్ కుమార్తె వైష్ణవి (18) నాంపల్లిలోని ఎంఏఎం కళాశాలలో ఓపెన్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతోంది.
అయితే ఈ నెల 29 న ఉదయం తండ్రి రాజ్ కుమార్ స్వయంగా తన కుమార్తెను కళాశాల వద్ద దించి వెళ్లారు. సాయంత్రం 5 గంటల సమయంలో ఆమెను ఇంటికి తీసుకువెళ్లడానికి తండ్రి తిరిగి కళాశాలకు రాగా, వైష్ణవి బయటకు రాలేదు.
దీంతో కంగారు పడిన ఆయన లోపలికి వెళ్లి విచారించారు. ఉదయం కళాశాల గేటు వద్ద వైష్ణవిని చూశానని, అయితే ఆమె తరగతులకు హాజరు కాలేదని ఆమె స్నేహితురాలు భాగ్య తెలిపింది.
బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా వైష్ణవి ఎరుపు రంగు డ్రెస్, ఎరుపు రంగు చున్నీ ధరించి ఉందని ఎవరికైనా సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై తెలిపారు.



