
ఒక నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం
రోడ్డు భద్రత వారోత్సవాల్లో
ఏసీపీ సారంగపాణి హెచ్చరిక
సి కే న్యూస్ చింతకాని ప్రతినిధి.
చింతకాని:
రోడ్డు మీద వాహనం నడిపేటప్పుడు చేసే చిన్న నిర్లక్ష్యం కూడా నిండు ప్రాణాలను బలిగొనాల్సిన పరిస్థితి తీసుకురాగలదని వైరా ఏసీపీ సారంగపాణి హెచ్చరించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన “Arrive Alive Road Safety Campaign–2006” కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మండలంలోని బసాపురం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద జరిగింది. గ్రామ సర్పంచ్ ఆవుల నరసింహారావు అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఏసీపీ సారంగపాణి మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలు యాదృచ్ఛికంగా జరగవని, వాటిలో ఎక్కువ భాగం డ్రైవర్ల నిర్లక్ష్యం, అవగాహన లోపం వల్లనే జరుగుతున్నాయని తెలిపారు. ఒక్క క్షణం అజాగ్రత్త ఒక కుటుంబాన్ని జీవితాంతం విషాదంలో ముంచే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
మోటార్ సైకిల్ నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ పెట్టుకోవడం మాత్రమే కాకుండా దాని పట్టీ బిగించుకోవడం అత్యంత ముఖ్యమని సూచించారు. ప్రమాద సమయంలో తలను రక్షించేది హెల్మెట్ మాత్రమేనని, అది ప్రాణాలకు కవచంలాంటిదని తెలిపారు.
మద్యం సేవించి వాహనం నడపడం అత్యంత ప్రమాదకరమని, అలాంటి చర్యలు కేవలం మన ప్రాణాలనే కాదు, ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తాయని హెచ్చరించారు. అలాగే సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, అధిక వేగంతో వాహనం నడపడం వంటి అలవాట్లు ప్రమాదాలకు ప్రధాన కారణాలని వివరించారు.
కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, గ్రామీణ ప్రాంతాల్లో ట్రాక్టర్లు, ఆటోలు నడిపే వారు రాత్రివేళల్లో రిఫ్లెక్టర్లు, రేడియం స్టిక్కర్లు వినియోగించాలని సూచించారు. చిన్న చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడగలవని అన్నారు.
ప్రమాదం జరిగిన తర్వాత బాధపడటం కన్నా ముందే జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ తమ భద్రతను తామే కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ వెంకట ప్రసాద్, ఎస్సై వీరేందర్, ఏఎస్ఐ సువర్ణ బాబు, ఉప సర్పంచ్ చంద్రకాంత్ నర్సరావు, చింతకాని పోలీస్ సిబ్బంది వెంకటేశ్వర్లు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై రోడ్డు భద్రతపై అవగాహన పొందారు.




