
నెల రోజుల శిశువు కిడ్నాప్…లింగపల్లి రైల్వేస్టేషన్లో తల్లి ఒడిలో నుంచి ఎత్తుకెళ్లిన దుండగుడు
తల్లి ఒడిలో నిద్రిస్తున్న నెల రోజుల శిశువును గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్చేసిన ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లింగంపల్లి ఏరియాలో సర్కస్ చేస్తూ జీవనం సాగించే దంపతులు తమ పాపతో కలిసి లింగంపల్లి రైల్వేస్టేషన్ఫుట్ పాత్పై నివసిస్తున్నారు.
గత నెల 30న రాత్రి తల్లి పాపతో కలిసి ఫుట్పాత్ పై నిద్రించింది. అర్ధరాత్రి మెలకువ వచ్చి చూసేసరికి శిశువు కనిపించలేదు. దంపతులు స్థానికంగా వెతికినా ఆచూకీ లభించకపోవడంతో చందానగర్ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, సీసీ ఫుటేజీ పరిశీలించారు.
అందులో గుర్తు తెలియని వ్యక్తి ఆటోలో వచ్చి, పాపను ఎత్తుకెళ్లినట్లు కనిపించింది. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి, శిశువును కిడ్నాప్చేసిన వ్యక్తి చాంద్రాయణగుట్టలో పిల్లలు లేని దంపతులకు అమ్మేసినట్లు గుర్తించారు. కిడ్నాప్చేసిన వ్యక్తితోపాటు పాపను కొనుగోలు చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.




