
బాబాయి ఇంటిపై కన్నేసి.. దొంగలతో కుట్ర
లక్ష్యం ఒక ఇల్లు.. దోచింది మరో ఇల్లు
నాలుగుసార్లు రెక్కీ.. ఐదోసారి పోలీసుల వల
ఆస్తి వివాదం.. అంతర్రాష్ట్ర దొంగలతో చేతులు కలిపిన మేనల్లుడు
సీకే న్యూస్ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్ నరసింహ జూలై 31 2026: ఏన్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గత ఏడాది నమోదైన గృహచోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా, దర్యాప్తులో అంతర్రాష్ట్ర గృహచోరీ ముఠా కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పలు గృహచోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
పోలీసుల కథనం ప్రకారం… ఏన్కూరుకు చెందిన గాదె నాగరాజు తన బాబాయి గాదె రామారావుతో ఉన్న ఆస్తి వివాదం నేపథ్యంలో అతని ఇంట్లో దొంగతనం చేయించాలని కుట్ర పన్నాడు. ఈ క్రమంలో జైలులో పరిచయమైన అలవాటైన నేరస్థులు జల్లేపల్లి వెంకటేశ్వరరావు అలియాస్ వెంకీ, చిల్లరి సురేష్, ఖాజా నాగ వీర భాస్కరరావులను సంప్రదించాడు.
2025 జూన్ 17న నిందితులు ఏన్కూరుకు వచ్చి గాదె రామారావు ఇంట్లో చోరీకి ప్రయత్నించగా కుటుంబ సభ్యులు ఉండటంతో వెనుదిరిగారు. అనంతరం సమీపంలోని తాళం వేసి ఉన్న ఇంటిలో చోరీ చేసి రూ.1.10 లక్షల నగదుతో పాటు బంగారు, వెండి ఆభరణాలను అపహరించారు. దోచుకున్న సొత్తును గ్రామ శివారులో పంచుకున్నట్లు దర్యాప్తులో తేలింది.
ఆ తర్వాత కూడా పలుమార్లు గాదె రామారావు ఇంటి వద్ద రెక్కీ నిర్వహించినప్పటికీ ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉండటంతో చోరీకి పాల్పడలేకపోయినట్లు పోలీసులు తెలిపారు. తిరుగు ప్రయాణాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని పలు ప్రాంతాల్లో గృహచోరీలకు పాల్పడినట్లు నిందితులు ఒప్పుకున్నారని వెల్లడించారు.
ఈ కేసులో జల్లేపల్లి వెంకటేశ్వరరావు, గాదె నాగరాజులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉండగా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నిందితులు సంఘటితంగా నేరాలకు పాల్పడుతున్న ముఠాకు చెందినవారని తేలడంతో భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 111 (ఆర్గనైజ్డ్ క్రైమ్)ను కూడా కేసులో చేర్చినట్లు పోలీసులు తెలిపారు.
ప్రజలు ఇళ్లకు తాళం వేసి వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్‌హెచ్‌వో ఎన్. సంధ్య సూచించారు.




