
సంక్షేమ పథకాలు కాగితాలకే పరిమితమా?
దివ్యాంగుల సంక్షేమం మాటలకేనా..?
అర్హుడికి అందని ప్రభుత్వ సాయం
ఒక్క ఛార్జింగ్ సైకిల్ కోసం దివ్యాంగుడి విజ్ఞప్తి
ఏళ్లుగా ఎదురుచూపులు.. దివ్యాంగుడికి నెరవేరని ఆశ
అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం శూన్యం
సీకే న్యూస్ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఆగస్టు 02 2026: ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు ప్రకటిస్తున్నప్పటికీ, అవి నిజంగా అర్హులైన లబ్ధిదారులకు చేరుతున్నాయా అనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదని ఖమ్మం జిల్లా ఏన్కూరు మండల పరిధిలోని రాంనగర్ తండాకు చెందిన దివ్యాంగుడు ధారావత్ అశోక్ కుమార్, లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
తాను దివ్యాంగుడినని, జీవనోపాధి కోసం ప్రభుత్వం నుంచి కనీస సహాయం అందుతుందనే ఆశతో పలుమార్లు అధికారులను, ప్రజాప్రతినిధులను కలిసి వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని తెలిపారు. ముఖ్యంగా తనకు అత్యవసరమైన ఛార్జింగ్ సైకిల్ కోసం ఎన్నోసార్లు దరఖాస్తు చేసినప్పటికీ, ప్రతి సారి “ఇప్పిస్తాం”, “చూస్తాం”, “త్వరలో మంజూరు చేస్తాం” అనే హామీలు మాత్రమే లభించాయని, కానీ ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని వాపోయారు.
గత ప్రభుత్వ హయాంలో కూడా దివ్యాంగులకు రుణాల ద్వారా ఉపాధి కల్పిస్తామని దరఖాస్తులు స్వీకరించారని, గ్రామస్థాయిలో లాటరీ విధానం కూడా నిర్వహించారని తెలిపారు. అయితే ఆ ప్రక్రియలో తనకు ఎలాంటి లబ్ధి దక్కలేదని, ఆ తర్వాత కూడా సంబంధిత అధికారులను పలుమార్లు కలిసినా ఫలితం లేకుండాపోయిందని చెప్పారు.
ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితి మారుతుందని ఆశించామని, అయితే ఇప్పటికీ అధికారుల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మండల స్థాయి అధికారులు, జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అనేకసార్లు వెళ్లినా తమ సమస్యను ఎవరూ సానుకూలంగా పరిష్కరించలేదని పేర్కొన్నారు.
స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తమ సమస్యను ప్రత్యక్షంగా విన్నప్పటికీ, ఇప్పటి వరకు ఎలాంటి సహాయం అందలేదని తెలిపారు. దివ్యాంగుల కోసం ప్రభుత్వం ప్రకటిస్తున్న సంక్షేమ పథకాలు గ్రామీణ ప్రాంతాల్లో నిజమైన అర్హులకు చేరేలా పర్యవేక్షణ అవసరమని అభిప్రాయపడ్డారు.
జీవనోపాధి కోసం చిన్న కిరాణా దుకాణం ఏర్పాటు చేసుకునేందుకు ఆర్థిక సహాయం అందించాలని, అది సాధ్యం కాకపోతే కనీసం తన సంచారానికి, ఉపాధికి ఉపయోగపడే ఛార్జింగ్ సైకిల్ అయినా మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని, జిల్లా అధికారులను, ప్రజాప్రతినిధులను వేడుకున్నారు.
దివ్యాంగుల సంక్షేమం కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, నిజంగా అవసరమైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తనలాంటి అర్హులైన దివ్యాంగుల సమస్యలను అధికారులు ప్రత్యేకంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కారం చూపాలని కోరారు.




