అర్చకుడు రంగరాజన్ ను ఫోన్ లో పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
అర్చకుడు రంగరాజన్ ను ఫోన్ లో పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి;
చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. రంగరాజన్ పై కొందరు దుండగులు దాడికి పాల్పడిన నేపథ్యంలో సీఎం ఫోన్‌లో మాట్లాడారు.
ఇలాంటి దాడులను సహించేది లేదని, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.
రంగరాజన్ పై అమానుష దాడి బాధాకరం - కిషన్ రెడ్డి
"అర్చకుడు రంగరాజన్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. వారు ఉన్నతస్థాయి పదవులను వదిలి సనాతన ధర్మ పరిరక్షణకు అంకితభావంతో సేవలు అందిస్తూ, భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తూ ఉన్నతమైన ధార్మిక విలువలను పాటిస్తున్నారు. అటువంటి గౌరవప్రదమైన అర్చక వృత్తిలో ఉన్న వ్యక్తిపై జరిగిన ఈ అమానుష దాడి బాధాకరం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దౌర్జన్య చర్యలకు, బెదిరింపులకు, భౌతిక దాడులకు ఏ మాత్రం స్థానం లేదు. ఇది కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి మాత్రమే కాకుండా, సనాతన ధర్మంపై జరిగిన దాడిగా భావించాలి" -కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ఆరుగురి అరెస్ట్
చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకుడు రంగరాజన్‌పై దాడిపై రాజేంద్రనగర్ డీసీపీ సీహెచ్.శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వీరరాఘవరెడ్డి, ఇద్దరు మహిళలు సహా మొత్తం ఆరుగురిని అరెస్టు చేసినట్లు డీసీపీ వెల్లడించారు. సోమవారం ఉదయం ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన వీర రాఘవరెడ్డిని అరెస్టు చేశామన్నారు. రామరాజ్యం అనే సంస్థకు ఆర్థిక సాయం చేయాలని, సభ్యుల్ని చేర్పించాలని రంగరాజన్‌ను డిమాండ్ చేశారన్నారు. అందుకు నిరాకరించడంతో రంగరాజన్ పై దాడి చేశారని డీసీపీ తెలిపారు.