అటవీ సిబ్బందిపై దాడి.. ఇద్దరికి గాయాలు
అటవీ సిబ్బందిపై దాడి.. ఇద్దరికి గాయాలు;
అటవీ సిబ్బందిపై దాడి.. ఇద్దరికి గాయాలు
పోడును అడ్డుకోవడంతో ఘర్షణ
అటవీ సిబ్బందిపై దాడి చేస్తున్న పోడురైతు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆజంనగర్‌లో అటవీశాఖ అధికారులు, పోడుదారుల మధ్య గురువారం వివాదం చెలరేగింది.
ఆజంనగర్ దక్షిణ అటవీ బీట్‌లో కొందరు కొద్ది నెలల క్రితం పదెకరాల్లో భారీ వృక్షాలను నరికి పోడు చేయగా పలువురిపై కేసులు నమోదయ్యాయి. ఇటీవల అదే భూమిలో మిగిలిన చెట్ల మొదళ్లకు నిప్పుపెడుతున్నారని తెలియడంతో.. భూపాలపల్లి డీఎఫ్‌వో నవీన్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఆ భూమి మధ్యలో జేసీబీతో కందకాల తవ్వకం ప్రారంభించారు. దీంతో పోడుదారులు భారీ సంఖ్యలో తరలివచ్చి పనులను అడ్డుకోగా.. అటవీ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని జీపుల్లో తరలించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఓ మహిళ అస్వస్థతకు గురైంది. పోడుదారులు రాళ్ల దాడి చేయడంతో సెక్షన్ అధికారి మక్బూల్, జీపు డ్రైవర్ సలీమ్‌కు గాయాలయ్యాయి. జీపు అద్దం, ద్విచక్ర వాహనం ధ్వంసమయ్యాయి. విధులకు ఆటకం కలిగించి, దాడి చేసిన ఆరుగురు పోడుదారులపై ఆజంనగర్ ఇన్‌ఛార్జి రేంజి అధికారి ఉషా.. భూపాలపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమపైనా అటవీ అధికారులు దాడి చేసినట్లు పోడుదారులు ఆరోపించారు.
ప్రజలపై దాడులు చేస్తే ఊరుకోం: సీతక్క
అటవీ శాఖ అధికారులు ప్రజలపై దాడులు చేస్తే ఊరుకోబోమని మంత్రి సీతక్క స్పష్టంచేశారు. అధికారుల తీరును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళతానని చెప్పారు. మంచిర్యాల జిల్లా జన్నారంలో గురువారం నిర్వహించిన పట్టభద్రుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ''దురుసుతనాన్ని వదులుకొని వెనుకబడిన ప్రాంతాల్లో ఓపికతో పనిచేయాలి'' అని అటవీ సిబ్బందికి సూచించారు.