ఎస్సై వేధింపులు తట్టుకోలేకపోతున్నాం.. ఆత్మహత్యకు అనుమతించండి
ఎస్సై వేధింపులు తట్టుకోలేకపోతున్నాం.. ఆత్మహత్యకు అనుమతించండి;
ఎస్సై వేధింపులు తట్టుకోలేకపోతున్నాం.. ఆత్మహత్యకు అనుమతించండి సార్ అంటూ ఫ్లెక్సీతో కలెక్టరేట్ ఎదుట వృద్ధ దంపతుల ఆందోళన
భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం వేములపల్లికి చెందిన సంది సులోచన, ప్రతాప్ రెడ్డి దంపతులకు 12 ఎకరాల భూమి ఉంది
ఈ భూమికి వెళ్లడానికి ఉన్న దారిని రెండున్నరేళ్లుగా ములుగు జిల్లా కన్నాయిగూడెం ఎస్సైగా పనిచేస్తున్న ఇనిగాల వెంకటేష్, అతడి సోదరుడు, తండ్రి కలిసి మూసివేశారని ఆరోపించిన దంపతులు
దీనిపై హైదరాబాద్ వెళ్లి ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే ఆ ఎస్సై మాపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆందోళన
మూడేళ్లుగా పొలానికి వెళ్లలేక వ్యవసాయం చేయట్లేదని.. తమకు ఆత్మహత్యే దిక్కని, ఆత్మహత్యకు అనుమతించాలని ఫ్లెక్సీతో భూపాలపల్లి కలెక్టరేట్ ఎదుట నిరసన తెలియజేసిన వృద్ధ దంపతులు
మూడేండ్లుగా వ్యవసాయం చేయనివ్వట్లేదు, మేము సూసైడ్ చేసుకుంటాం.. మాకు అనుమతి ఇవ్వండి' అంటూ ఓ వృద్ధ దంపతులు సోమవారం భూపాలపల్లి కలెక్టరేట్ ఎదుట ఫ్లెక్సీ పట్టుకొని నిరసన తెలిపారు.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం వేములపల్లికి చెందిన సంది సులోచన, ప్రతాపరెడ్డి దంపతులకు గ్రామంలో 12 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలోకి వెళ్లే బండ్ల బాటను ములుగు జిల్లా కన్నాయిగూడెం ఎస్సై వెంకటేశ్, అతడి కుటుంబ సభ్యులు కలిసి 2022 మే 15న దున్ని తమ భూమిలో కలుపుకున్నారు. అప్పటి నుంచి దంపతులను భూమిలోకి వెళ్లనీయకుండా అడ్డుకోవడంతో పాటు, అక్రమ కేసులు పెట్టారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 2023 డిసెంబర్ 12న సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన ప్రజాదర్బార్‌కు దంపతులు వచ్చి ఫిర్యాదు చేశారు. ఎస్సై అక్రమ కేసులు పెట్టాడని, దీని వల్ల మూడేండ్లుగా పంట సాగు చేసుకోలేకపోతున్నామని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్పందించిన ఆఫీసర్లు సమస్యను పరిష్కరించాలని భూపాలపల్లి అప్పటి కలెక్టర్ భవేశ్ మిశ్రాకు సూచించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అప్పటి ఆర్డీవో రమాదేవి 2023 డిసెంబర్ 18 ఒకసారి, 27న రెండోసారి ఫీల్డ్ విజిట్ చేశారు.
బండ్లబాట పునరుద్ధరించాలని ఆదేశం
రైతు సులోచన ఫిర్యాదుతో రెండు సార్లు ఫీల్డ్ విజిట్ చేసిన ఆర్డీవో రమాదేవి పాత రికార్డులు, చుట్టుపక్కల రైతుల వాంగ్మూలాలు సేకరించారు. బండ్లబాటను దున్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సై, అతని తండ్రి, సోదరుడితో మాట్లాడారు. వేములపల్లి శివారులో సర్వే నంబర్ 296, 298 భూముల నుంచి మెట్టుపల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 30,79,80లలో గల వ్యవసాయ భూముల్లోకి వెళ్లేందుకు బండ్ల బాట వాడుకున్నారని గుర్తించిన ఆర్డీవో ఆ బాటను పునరుద్ధరించాలని గతేడాది జనవరి 8న ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే లా అండ్ ఆర్డర్‌కు ఇబ్బంది కలగకుండా మొగుళ్లపల్లి తహసీల్దార్, ఎస్సై కలిసి ఇరువర్గాల సమక్షంలో బాటను పునరుద్ధరించాలని ఆదేశించారు. కానీ ఆర్డీవో ఆదేశాలు ఇప్పటివరకు అమల్లోకి రాలేదు. బాటను పునరుద్ధరించాలని మొగుళ్లపల్లి తహసీల్దార్, పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవట్లేదని దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు.
'ఎస్సై తన పలుకుబడిని ఉపయోగించి ఆఫీసర్లపై ఒత్తిడి తెస్తూ బాటను పునరుద్ధరించకుండా అడ్డుకుంటున్నారు.. పోరాటం చేయడం ఇక తమ వల్ల కాదు, అందుకే చనిపోయేందుకు అనుమతి ఇవ్వండి' అంటూ ఫ్లెక్సీ పట్టుకొని కలెక్టరేట్ ఎదుట నిల్చున్నారు. ఆర్డీవో రవి దంపతులతో మాట్లాడి నిరసన విరమింపజేశారు.
దంపతుల సమస్య విషయమై మొగుళ్లపల్లి తహసీల్దార్ సునీత వివరణ కోరగా.. 'బండ్ల బాట వేయడానికి అవతలి వాళ్లు ఒప్పుకోవట్లేదు.. వంద మంది వచ్చి గొడవ పెడుతున్నరు.. ఆర్డీవో ఇచ్చిన ఆర్డర్స్‌లో ఇరుపక్షాల సమక్షంలోనే బాట పునరుద్ధరించాలని ఉంది.. వాళ్లొస్తలేరు, కాంప్రమైజ్ కాలే.. మేమేం చేస్తాం' అని సమాధానం ఇచ్చారు.