Khammam
Trending

రుణమాఫీ జాబితాలో పోడు రైతులకు చోటేదీ..?

రుణమాఫీ జాబితాలో పోడు రైతులకు చోటేదీ..?

రుణమాఫీ జాబితాలో పోడు రైతులకు చోటేదీ..?

రుణమాఫీ వర్తింపచేయాలంటూ బ్యాంకు ముట్టడించిన పోడు రైతులు

CK న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు జూన్ 08 2026: ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ పథకం తమకు వర్తింపజేయకుండా అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ గిరిజన పోడు రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. మూలపోచారం, రాంనగర్ తండా, నెమలిపురి, రంగాపురం గ్రామాలకు చెందిన భారీ సంఖ్యలో రైతులు తిమ్మారావుపేటలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తిమ్మారావుపేట సెంటర్‌ నుంచి బ్యాంకు వరకు ర్యాలీ నిర్వహించి తమ ఆవేదనను వెల్లడించారు.
పోడు భూముల హక్కు పత్రాల ఆధారంగా గతంలో తీసుకున్న రూ.25 వేల పంట రుణం, వడ్డీల భారం కారణంగా ప్రస్తుతం లక్ష రూపాయలకు పైగా పెరిగిందని రైతులు వాపోయారు. ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించినప్పటికీ తమ ఖాతాలకు అది వర్తించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. మరోవైపు రుణాలు చెల్లించాలని బ్యాంకు అధికారులు ఒత్తిడి తీసుకురావడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చిందన్నారు.
ఈ నేపథ్యంలో గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, సీపీఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం ఆధ్వర్యంలో రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన రైతుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్ వెంటనే జోక్యం చేసుకొని గిరిజన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే దశలవారీగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
అనంతరం రైతులు బ్యాంకు మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని మేనేజర్ హామీ ఇచ్చారు. అలాగే రీజనల్ మేనేజర్‌తో ఫోన్‌లో మాట్లాడిన భూక్యా వీరభద్రం, గిరిజన రైతులకు వెంటనే రుణమాఫీ వర్తింపజేసి ఎకరానికి లక్ష రూపాయల చొప్పున రుణ సదుపాయం కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు బానోత్ బాలాజీ, సీపీఎం మండల కార్యదర్శి దొంతబోయిన నాగేశ్వరరావు, ఏర్పుల రాములు, భూక్యా లక్ష్మ, ఇటికాల లెనిన్, రైతు సంఘం నాయకులు నండూరి శ్రీనివాసరావు, గుడ్ల వెంకటేశ్వర్లు, కొంగర సుధాకర్, మాడపాటి మల్లికార్జునరావు, వలపాల నరసింహారావుతో పాటు పలువురు గిరిజన రైతులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button