
కోర్టు హాల్‌లో రచ్చ రచ్చ.. పొట్టు పొట్టు కొట్టుకున్న భార్య భర్తలు, బంధువులు (VIDEO)
Social media viral : ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లా కుటుంబ కోర్టు ఆవరణలో భార్యాభర్తలు బాహాబాహీకి దిగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కోర్టులో కుటుంబ వివాదానికి సంబంధించిన విచారణ ముగిసిన కొద్దిసేపటికే ఇరువర్గాలు రోడ్డున పడ్డట్టు కొట్టుకోవడం స్థానికంగా కలకలం రేపింది.
ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ కావడంతో పోలీసులు వెంటనే స్పందించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
మహారాజ్‌గంజ్ జిల్లా కేంద్రంలోని కుటుంబ కోర్టులో సెప్టెంబర్ 24న ఈ ఘటన జరిగింది. సమర్ధిరా నివాసి ప్రియా త్రిపాఠికి, కొయిలడాద్‌కు చెందిన మనీష్ కుమార్ మిశ్రాతో వివాహం జరిగింది. పెళ్లయిన నాటి నుంచి ఈ దంపతుల మధ్య వివాదాలు నడుస్తున్నాయి.
ఈ క్రమంలోనే భరణం కేసు విచారణ నిమిత్తం ఇద్దరూ కోర్టుకు హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ప్రియ తండ్రి లక్ష్మీకాంత్ వాంగ్మూలంతో విచారణ ప్రారంభమైంది.
విచారణ ముగిసిన తర్వాత ప్రియ, ఆమె సోదరి ప్రియాంక, తండ్రి కోర్టు గది నుంచి గ్రౌండ్ ఫ్లోర్ హాల్‌కు చేరుకున్నారు. అక్కడే భర్త మనీష్‌తో వివాదం ప్రారంభమైంది. తనపై మనీష్, మరో వ్యక్తి దాడి చేశారని ప్రియ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మనీష్ తన జుట్టు పట్టుకుని లాగడంతో పాటు కిందపడేసి గొంతు నులిమే ప్రయత్నం చేశాడని ఆరోపించారు.
అడ్డువచ్చిన తన తండ్రిని, సోదరిని కూడా వారు వదలలేదని వాపోయారు. ఈ గొడవ క్రమంగా పెద్దది కావడంతో ఇరువర్గాల బంధువులు కూడా ఒకరిపై ఒకరు పిడిగుద్దులు, చెంపదెబ్బలు కుమ్మరించుకున్నారు. కోర్టు ఆవరణలో అందరూ చూస్తుండగానే వారు కొట్టుకుంటున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
గమనించిన కోర్టు భద్రతా సిబ్బంది వెంటనే రంగంలోకి వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. తనకు ప్రాణహాని ఉందని ఆరోపిస్తూ బాధితురాలు కోత్వాలి పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసినట్లు కొత్వాలి మహారాజ్‌గంజ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ధర్మేంద్ర సింగ్ తెలిపారు.
కోర్టు ఆవరణలో దాడికి పాల్పడిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. వైరల్ అయిన వీడియో ఆధారంగా సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామని, ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై పూర్తి స్థాయి విచారణ చేపడతామని పోలీసులు స్పష్టం చేశారు.



