
గురుకుల విద్యాలయం భవనం నుంచి దూకి విద్యార్థిని ఆత్మ*హత్యాయత్నం…
మధిర : ఇటీవల నిర్వహించిన సప్లిమెంటరీ పరీక్షలలో ఫిజిక్స్ సబ్జెక్టులో కేవలం రెండు మార్కులు మాత్రమే వచ్చాయని, త్వరలో జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలలో ఫెయిల్ వుతానని ఓ విద్యార్థిని మానసిక ఆందోళనకు గురై తాను చదువుకుంటున్న గురుకుల విద్యాలయం భవనం నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని బోనకల్ మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది.
మధిర నియోజకవర్గం ముదిగొండ మండలం మాదాపురం గ్రామానికి చెందిన తుడుము ఉపేందర్, మహేశ్వరి దంపతుల కుమార్తె తుడుము సమీర ఈ విద్యా సంవత్సరంలో బోనకల్ మండల కేంద్రంలో గల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల జూనియర్ కళాశాలలో ఎంపీసీ ప్రథమ సంవత్సరం చదువుతుంది. అయితే చదువులో పెద్దగా రాణించలేక పరీక్షల్లో తప్పుతానని భయం తనలో ఏర్పడింది.
ఈ నెల 25 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానుండటంతో గురువారం కళాశాల ప్రిన్సిపాల్ పాసంగలపాటి వెంకట పద్మావతి ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ సుమారు రెండు గంటలపాటు కౌన్సిలింగ్ నిర్వహించారు. విద్యార్థులు ఎవరూ ఆందోళన చెందవద్దని, ఒత్తిడికి గురి కావద్దని కౌన్సిలింగ్ నిర్వహించి ధైర్యం చెప్పారు.
అయితే ఇటీవల నిర్వహించిన సప్లిమెంటరీ పరీక్షలలో సమీరా ఫిజిక్స్ సబ్జెక్టులో కేవలం రెండు మార్కులు మాత్రమే రావటంతో ఆ రోజు నుంచి సమీరా మానసికంగా ఆందోళన చెందుతుందని సహచర విద్యార్థినిలు తెలిపారు. సహచర విద్యార్థులతో తాను పరీక్షలో బాగా రాస్తానో, రాయలేనో అంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తుంది. ప్రతిరోజు లాగే శుక్రవారం క్లాసులు ప్రారంభమయ్యాయి.
ఉపాధ్యాయురాలు క్లాసులోకి వెళ్ళగానే ఆ విద్యార్ధిని చెప్పకుండా క్లాస్ నుంచి ఒక్కసారిగా బయటకు వెళ్ళింది. ఆ సమయంలో ఉపాధ్యాయురాలు విద్యార్థులతో మాట్లాడుతుండగా సమీరా వెళ్లిన విషయాన్ని ఆ ఉపాధ్యాయురాలు, సహచర విద్యార్థినిలు కూడా గమనించలేదు. సమీరా బాలికల గురుకుల కళాశాల రెండు అంతస్తుల భవనం నుంచి రైతు వేదిక గల స్థలం వైపు ఆత్మహత్య చేసుకునేందుకు దూకింది.
అయితే ఆ ప్రదేశంలో ఇసుక ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ఆ సమయంలో రైతు వేదిక నందు వార్డు మెంబర్లకు శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. వారు సమీరా బిల్డింగ్ పైనుంచి దూకిన విషయాన్ని గమనించి వెంటనే ప్రిన్సిపాల్ కి, ఉపాధ్యాయులకు సమాచారం అందించారు.
వెంటనే వారి స్పందించి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఎంపీడీవో కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ తన మోటార్ సైకిల్ పై మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం 108 లో వైద్య చికిత్స అందిస్తూ ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
జరిగిన సంఘటనను ప్రిన్సిపాల్ సంబంధిత ఉన్నతాధికారులకు, సమీరా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సమీరాను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన కొద్దిసేపటికే తల్లి మహేశ్వరి, బంధువులు అక్కడికి చేరుకున్నారు.
ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు వైద్య పరీక్షల నిర్వహించి సమీరా పాదానికి పక్కనే చిన్నపాటి ఎముక విరిగిందని, కొద్దిగా వెన్నుపూస దెబ్బ తిన్నదని వెంటనే హైదరాబాద్ నిమ్స్ కు తీసుకెళ్లాలని సూచించారు. విద్యార్థినికి ప్రాణహాని ఏమీ లేదని వైద్యుల స్పష్టం చేశారు.
ఈ సంఘటన తెలిసి విద్యార్థి సంఘాల నాయకులు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. హైదరాబాద్ తీసుకెళ్లడానికి వీలు లేదంటూ బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకున్నారు. దీంతో గత్యంతరం లేక ఖమ్మంలోనే స్తంభాద్రి ఆస్పత్రిలో సమీరాను చేర్పించారు.
ఈ సంఘటన జరిగిన కొద్దిసేపటికే గురుకులాల జాయింట్ సెక్రెటరీ శారద బాలికల గురుకుల విద్యాలయం ప్రిన్సిపాల్ పాసంగులపాటి వెంకట పద్మావతికి ఫోన్ చేసి ఆరా తీశారు. దీంతో జరిగిన సంఘటనను ప్రిన్సిపాల్ ఆమెకు వివరించారు. బాలిక పరిస్థితి ఎలా ఉందని ఆమె ప్రిన్సిపాల్ ను అడిగి తెలుసుకున్నారు.
మెరుగైన వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని శారద ప్రిన్సిపాల్ ను ఆదేశించారు. అదేవిధంగా జిల్లా అదనపు కలెక్టర్ పి శ్రీనివాస్ రెడ్డి, డి సి ఓ జ్యోతి, జోనల్ ఆఫీసర్ అలివేలు స్పందించి ప్రిన్సిపాల్ కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
సంఘటన ఎలా జరిగింది? ప్రస్తుతం బాలిక పరిస్థితి ఎలా ఉంది అంటూ ఆమెను వారు వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని వారు ప్రిన్సిపాల్ ను ఆదేశించారు.
మండల తహసీల్దార్ మద్దెల రమాదేవి, మండల విద్యాశాఖ అధికారి దామాల పుల్లయ్య గిర్దావర్-2 జంగంగూడెం మైతిలి, బోనకల్ జిపిఓ తిరుమలశెట్టి శ్రీనివాసరావు గురుకుల విద్యాలయాన్ని సందర్శించారు. సంఘటన వివరాలను ప్రిన్సిపాల్ ను అడిగి తెలుసుకున్నారు
ప్రిన్సిపల్ వెంకట పద్మావతి
కళాశాల ప్రిన్సిపల్ వెంకట పద్మావతిని సంఘటనపై వివరణ అడగగా క్లాసు నడుస్తున్న సమయంలో తరగతి గదిలో నుంచి వెళ్ళింది ఎవరు చూడలేదని బిల్డింగ్ పైకి ఎక్కడానికి గేటుకు తాళం వేసి ఉంచుతామని ఆ తాళం ఎలా తీసిందో ఏమీ అర్థం కాలేదు అన్నారు.
సంఘటన జరిగిన వెంటనే మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
వైద్యులు హైదరాబాద్ కు రిఫర్ చేయగా విద్యార్థి సంఘ నాయకులు ఇక్కడే వైద్యం చేయించాలని పట్టుబట్టడంతో ఖమ్మంలోనే ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేయిస్తున్నట్లు పేర్కొన్నారు.



