PoliticalsuryapetaTelangana

కొదాడలో బిగ్ స్కామ్.. లక్షల రూపాయలతో రికవరీ మేనేజర్ పరార్ !

కొదాడలో బిగ్ స్కామ్.. లక్షల రూపాయలతో రికవరీ మేనేజర్ పరార్ !

కొదాడలో బిగ్ స్కామ్.. లక్షల రూపాయలతో రికవరీ మేనేజర్ పరార్ !

కొదాడ పట్టణంలోని బజాజ్ ఫైనాన్స్ కార్యాలయంలో రికవరీ మేనేజర్‌గా పనిచేస్తున్న వ్యక్తి లోన్ డబ్బులు స్వీకరించి రసీదు ఇవ్వకుండా పరారవడంతో బాధితులు శనివారం బజాజ్ కార్యాలయం ఆందోళనకు దిగారు.
మునగాల మండలం కలకోవ గ్రామానికి చెందిన కాసాని శ్రీను తన లోన్ బకాయిలు తీర్చేందుకు ఫోన్‌పే ద్వారా రూ.1 లక్షను మేనేజర్ గంగిశెట్టి వెంకటేష్‌కు చెల్లించినట్లు ఆరోపించారు.

అయితే చెల్లింపునకు సంబంధించి ఎలాంటి రసీదు ఇవ్వకపోవడంతో పాటు అనంతరం ఆయన అందుబాటులో లేకపోవడం వివాదానికి దారితీసింది.

బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం రికవరీ మేనేజర్‌గా వ్యవహరిస్తున్న వెంకటేష్ స్వయంగా ఫోన్ చేసి బకాయిలు వెంటనే చెల్లించాలని ఒత్తిడి తెచ్చాడని, కంపెనీ ఖాతాకు కాకుండా వ్యక్తిగత ఫోన్‌పే నంబర్‌కు డబ్బులు పంపాలని సూచించాడని ఆరోపించారు.

నమ్మకంతో రూ.1 లక్షను బదిలీ చేసిన అనంతరం రసీదు కోరగా ‘తర్వాత ఇస్తాం’ అంటూ తప్పించుకున్నాడని తెలిపారు. కొద్ది రోజులకే ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో అనుమానం పెరిగిందని చెప్పారు.

తదుపరి బాధితుడు కార్యాలయానికి వెళ్లి విచారణ జరపగా, సంబంధిత వ్యక్తి తమ సిబ్బందిలో లేడని, తమకు సంబంధం లేదని కార్యాలయ సిబ్బంది చెప్పడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విధంగా మరికొందరు కూడా డబ్బులు చెల్లించి మోసపోయినట్లు వెల్లడించడంతో విషయం పెద్దఎత్తున బయటపడింది.

పదుల సంఖ్యలో బాధితులు కార్యాలయం ఎదుట చేరుకుని న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. బాధితులతో మాట్లాడి ఫిర్యాదులు స్వీకరించారు.

అనంతరం కంపెనీ రీజనల్ మేనేజర్ సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులతో చర్చలు జరిపారు. పూర్తిస్థాయి విచారణ జరిపి డబ్బులు చెల్లించిన వారందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సంబంధిత వ్యక్తి పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

రీజనల్ మేనేజర్ హామీతో బాధితులు ఆందోళన విరమించగా, ఈ ఘటన పై పట్టణంలో చర్చనీయాంశమైంది. లోన్ చెల్లింపులు చేసే సమయంలో అధికారిక ఖాతాల ద్వారానే చెల్లింపులు చేయాలని, రసీదులు తప్పనిసరిగా తీసుకోవాలని పోలీసులు ప్రజలకు సూచించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button