
ఎస్సై వేధిస్తున్నాడంటూ హోంగార్డు ఆత్మహత్య!
సోషల్‌మీడియాలో ఆడియో వైరల్
నాగర్‌కర్నూల్ జిల్లాలో చెంచువర్గానికి చెందిన హోంగార్డు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొల్లాపూర్ మండలం నార్లాపూర్ చెంచుగూడెంకు చెందిన బయ్యన్న (46) కోడేరు పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. సలేశ్వరం జాతర సందర్భంగా విధుల్లో ఉన్న ఆయన విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు.
అధికారుల వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చనిపోవడానికి ముందు హోంగార్డు మాట్లాడిన చివరి మాటల ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. వివరాలిలా ఉన్నాయి.
సలేశ్వరం జాతర సందర్భంగా అధికారులు బయ్యన్నకు బందోబస్తు డ్యూటీ వేసినట్టు తెలుస్తున్నది. మంగళవారం డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన బయ్యన్నను ఫోన్‌లో ఎవరో తిడుతున్నట్టు మృతుడి రెండో భార్యతోపాటు ఇంటి చుట్టుపక్కలవారు గమనించారు.
బుధవారం జాతర డ్యూటీకి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లిన బయ్యన్న.. కొద్దిసేపటికే ఆత్మహత్య చేసుకున్నాడు.
అధికారుల వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఎల్లూరుకు చెందిన మల్లయ్యతో బయ్యన్న మాట్లాడిన వీడియో ఆరోపణలకు బలాన్నిచ్చేలా ఉన్నది.
ఎస్సై తనను కులంపేరుతో, కుటుంబసభ్యుల ముందే తిట్టాడని.. అందువల్లే విషం తాగానని బయ్యన్న చెప్తున్నట్టు ఆడియోలో ఉన్నది. ఈ ఆడియో వైరల్ కావడం పోలీసుశాఖలో కలకలం రేపుతున్నది.



