
డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్ బాలకృష్ణకు ఘన సన్మానం – విద్యార్థులకు సీపీఆర్‌పై అవగాహన
CK న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు జులై 01 2026: మండలంలోని తూతకలింగన్నపేట గ్రామపంచాయతీ పరిధిలో గల గుడ్ న్యూస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్‌లో జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏన్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ బాలకృష్ణను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు డాక్టర్ బాలకృష్ణకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, వ్యక్తిగత పరిశుభ్రత, సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, తగిన నిద్ర వంటి మంచి అలవాట్లను ప్రతి విద్యార్థి అలవరచుకోవాలని సూచించారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్య సమస్యలు తలెత్తిన వెంటనే సమీప వైద్యులను సంప్రదించాలని తెలిపారు.
అదేవిధంగా అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడేందుకు అత్యంత కీలకమైన సీపీఆర్ (కార్డియో పల్మనరీ రీససిటేషన్) గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. గుండె స్పందన లేదా శ్వాస ఆగిపోయిన వ్యక్తికి సరైన సమయంలో సీపీఆర్ అందించడం ద్వారా ప్రాణాలను రక్షించే అవకాశం ఉంటుందని వివరించారు. సీపీఆర్ నిర్వహించే ప్రాథమిక విధానాన్ని విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా వివరించి, అత్యవసర పరిస్థితుల్లో ధైర్యంగా స్పందించి వెంటనే వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ సమాజానికి వైద్యులు అందిస్తున్న సేవలు అమూల్యమైనవని, ప్రాణాలను కాపాడే వారి సేవలను గుర్తిస్తూ ప్రతి సంవత్సరం డాక్టర్స్ డేను నిర్వహించడం ఆనందదాయకమని అన్నారు. విద్యార్థులు వైద్య వృత్తి గొప్పతనాన్ని గుర్తించి సమాజ సేవ పట్ల అవగాహన పెంపొందించుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సిస్టర్ అమల, జోస్లీమ్, తేజ, లక్ష్మీనారాయణ, కావ్య, కల్పనా, జ్యోతి, భావన, స్రవంతి, శశికళ, ఇంద్ర, శారద, నాగధీర్గ, సరోజ, శైలజతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు ఇతర సిబ్బంది పాల్గొని డాక్టర్ బాలకృష్ణకు డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.




