
నా ఇన్సూరెన్స్ డబ్బులతో డాడీకి ట్రీట్‌మెంట్ చేయించు మమ్మీ.. లెటర్ రాసి ఏఎన్ఎం ఆత్మహత్య
Web desc : ఏపీలోని నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. తండ్రి అనారోగ్యంతో మనస్తాపానికి గురైన ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. తాను చనిపోతే వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులతో డాడీకి ట్రీట్‌మెంట్ చేయించండి అని ఓ సూసైడ్ నోట్ కూడా రాసింది.
ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా ఓజిలి మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన శ్రీపతి సాయి చందన ప్రియ (27) చిల్లకూరు మండలం తోనుకుమల సచివాలయం పరిధిలో ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తోంది.
ఏడాది క్రితం బదిలీపై వచ్చిన సాయి చందన ప్రియ ఇటీవల సచివాయంలో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివిధ పనుల నిమిత్తం అక్కడకు వెళ్లిన స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఘటనాస్థలిలో ఓ సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.
సూసైడ్ నోట్‌లో ‘మమ్మీ, డాడీ.. మన్నించండి.. నా చావుకు ఎవరూ కారణం కాదు. నేను రూ.60 లక్షల ఇన్సూరెన్స్ చేశాను. నా మరణానంతరం వచ్చే మొత్తంతో నాన్నకు వైద్యం చేయించు. అక్కా.. అమ్మ, నాన్నను జాగ్రత్తగా చూసుకో‘అని సాయి చందన ప్రియ రాసింది. నేను పాము కాటుతో లేదా కరెంటు షాక్‌తో చనిపోయినట్లుగా డెత్ సర్టిఫికెట్ ఇప్పించండి..
నా ఇన్సూరెన్స్ డబ్బులతో నాన్నకు ట్రీట్మెంట్ చేయించండి అని ఆ లేఖలో కోరింది. కాగా, సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.
మృతురాలు చందన ప్రియ తండ్రి రమణయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.
చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్నాడు. తల్లి సుకుమారి గ్రామంలో అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేస్తోంది. ఆమెకు కూడా పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే చందన ప్రియ మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.




