
హతీరాం బాపూజీ 597వ జయంతి వేడుకలు
సేవాలాల్ సేన ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు – మహా భోగ్ బండారో నిర్వహణ
పెద్దఎత్తున తరలివచ్చిన బంజారా భక్తులు – ఆధ్యాత్మిక వాతావరణంలో వేడుకలు
CK న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు జూలై 19 2026: ఏన్కూరు మండలం మూలపోచారం గ్రామపంచాయతీ పరిధిలోని రాంనగర్ తండాలో ఉన్న బూడియా బాపు దేవస్థానంలో శ్రీ శ్రీ హతీరాం మహారాజ్ (హతీరాం బాపూజీ) 597వ జయంతి వేడుకలను ఆదివారం సేవాలాల్ సేన, సేవాలాల్ ధర్మజాగరణ సేన ఆధ్వర్యంలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మహా భోగ్ బండారో కార్యక్రమాన్ని నిర్వహించి, వేలాదిమంది భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు.
ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో దేవస్థానానికి చేరుకుని హతీరాం బాపూజీ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదం పంపిణీ చేసి, మహా భోగ్ బండారోలో పాల్గొన్న భక్తులకు అన్నప్రసాదం అందించారు.
కార్యక్రమం మొత్తం భక్తి, ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది.
ఈ సందర్భంగా ఫిజియోథెరపీ వైద్యుడు భాదవత్ రవి మాట్లాడుతూ, శ్రీ శ్రీ హతీరాం బాపూజీ చూపిన సేవా మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని అన్నారు. సమాజ సేవే నిజమైన దైవసేవ అనే సందేశాన్ని బాపూజీ తన జీవితంతో చాటిచెప్పారని పేర్కొన్నారు. యువత ఆధ్యాత్మికతతో పాటు సేవా కార్యక్రమాల్లో ముందుండి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా వైరా నియోజకవర్గ బీఆర్‌ఎస్ నాయకురాలు బానోత్ మనీషా లక్ష్మి మదన్‌లాల్ మాట్లాడుతూ, హతీరాం బాపూజీ బోధించిన సేవా తత్వం, ఆధ్యాత్మిక మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని సూచించారు. బంజారా సమాజ ఐక్యత, సంస్కృతి పరిరక్షణకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు.
బంజారా సంప్రదాయాలు, సంస్కృతిని భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
హతీరాం బాపూజీ జయంతి సందర్భంగా నిర్వహించిన మహా భోగ్ బండారో కార్యక్రమం భక్తులందరినీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. పరిసర గ్రామాల నుంచి బంజారా కుటుంబాలు, మహిళలు, యువకులు, చిన్నారులు పెద్దఎత్తున తరలివచ్చి హతీరాం బాపూజీకి ఘనంగా నివాళులర్పించారు. భజన కార్యక్రమాలు, ప్రార్థనలు నిర్వహించి భక్తి భావాన్ని చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో సేవాలాల్ ధర్మజాగరణ సేన ఏన్కూరు మండల అధ్యక్షుడు అమృతరాజు సాదు, సేవాలాల్ సేన కన్వీనర్లు ఇస్లావత్ చందు నాయక్, భూక్యా వినోద్ నాయక్, సేవాలాల్ సేన ఏన్కూరు మండల అధ్యక్షుడు ప్రవీణ్ నాయక్, ఉపాధ్యక్షుడు సునీల్ నాయక్, ప్రధాన కార్యదర్శి రమేష్ నాయక్, గిరిజన విద్యార్థి సంఘం మండల అధ్యక్షుడు ప్రవీణ్ నాయక్, మూలపోచారం సర్పంచ్ లలిత, టియల్ పేట సర్పంచ్ ప్రవీణ్ నాయక్, కేఆర్ పురం సర్పంచ్ నరసింహరావు,రాంనగర్ తండా నాయకులు శ్రీను నాయక్, హరి సింగ్ నాయక్, చందర్‌జీ, భజన్‌లాల్, రఘు, శంకర్, బాలకృష్ణ నాయక్, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు, విద్యార్థులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. హతీరాం బాపూజీ ఆశీస్సులతో సమాజంలో సేవాభావం, ఐక్యత, ఆధ్యాత్మిక చైతన్యం మరింత పెంపొందాలని ఆకాంక్షించారు.




