
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ఎదగాలి
సీకే న్యూస్ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఆగస్టు 16 2026: క్రమశిక్షణ, నైతిక విలువలతో కూడిన సంస్కారవంతమైన విద్య ఎంతో అవసరమని గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థి, ఇంటిగ్రామ్ లైఫ్ సైన్స్ ఫార్మా కంపెనీ అధినేత బండారు నరసింహారావు అన్నారు. శనివారం ఏన్కూరు గురుకుల పాఠశాలలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో అత్యధిక ప్రతిభ కనబరిచిన నలుగురు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున మొత్తం రూ.20 వేల నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదివి పాఠశాలకు మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు ఇప్పటివరకు సుమారు రూ.కోటి విరాళాలతో దశలవారీగా వివిధ వసతులు కల్పించినట్లు నరసింహారావు తెలిపారు. భవిష్యత్తులోనూ పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు ఎల్లవేళలా ముందుంటారని చెప్పారు.
అనంతరం చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ వేము రాజు, అలుమ్ని కార్యదర్శి కృష్ణయ్య, ఏటీపీ శ్రీనివాస్, డిప్యూటీ వార్డెన్ రజిని, ఉపాధ్యాయులు సునీల్, విశ్వేశ్వరరావు, అనిల్, కుటుంబరావు, శివకుమార్, రవికుమార్, జమునారాణి, శారా స్వప్న, చైతన్య, విజయ్‌కుమారి, వీరశరణ్ గాంధీ తదితరులు పాల్గొన్నారు.




