
ఉద్యోగం పోవడంతో సెంట్రింగ్ కూలీగా మారిన ప్రభుత్వ టీచర్..!
Web desc : ఓ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం కోల్పోయి సెంట్రింగ్ కూలీగా మారిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లాకు చెందిన లక్ష్మీరాజం 2012లో వీఆర్‌ఏగా ప్రభుత్వ సర్వీసులో చేరి 11 ఏళ్లపాటు పనిచేశారు.
ఆ తర్వాత వార్డ్ ఆఫీసర్‌గా పదోన్నతి పొందారు. ఉద్యోగం చేస్తూనే డీఎస్సీ రాసిన రాజంకు మంచి ర్యాంకు వచ్చింది. దాంతో మున్సిపల్ ఉద్యోగానికి రాజీనామా చేసి.. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరారు.
అయితే సాంకేతిక కారణాలతో అధికారులు ఉద్యోగం నుంచి తొలగించడంతో.. ప్రస్తుతం ఆయన బతుకుదెరువు కోసం సెంట్రింగ్ కార్మికుడిగా పనిచేస్తున్నారు. ఇంతకూ ఏం జరిగిందంటే.. 2024 అక్టోబర్ 5న డీఎస్సీ ఉద్యోగం కోసం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరిగింది.
అయితే అప్పటికి లక్ష్మీరాజం ‘రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (RCI)’ సర్టిఫికెట్ గడువు ముగిసింది. దాంతో ఆయన సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లో అప్పటికే రెన్యువల్ కోసం దరఖాస్తు చేసిన పత్రాలను చూపించారు.
అక్టోబర్ 7న ఢిల్లీలో సర్టిఫికెట్‌ను రెన్యువల్ చేయించుకుని సమర్పించారు. ఆ తర్వాత ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నియామక పత్రం అందుకుని అక్టోబర్ 16న విధుల్లో చేరారు. దాదాపుగా 8 నెలలపాటు ఉపాధ్యాయుడిగా పనిచేశారు.
ఆ తర్వాత అధికారులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీ నాటికి లక్ష్మీరాజం ఆర్‌సీఐ సర్టిఫికెట్ రెన్యువల్ కాలేదన్న సాంకేతిక కారణాన్ని ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు. దాంతో తీవ్ర ఆవేదనకు గురైన లక్ష్మీరాజం హైకోర్టును ఆశ్రయించారు.
కోర్టు ‘స్టేటస్ కో’ ఉత్తర్వులు జారీచేసింది. కానీ ప్రస్తుతం ఏ ఉపాధీ లేకపోవడంతో.. లక్ష్మీరాజం సెంట్రింగ్ కూలీగా జీవనం గడుపుతున్నారు. ఈ క్రమంలో సోమవారం ఆయన జగిత్యాల ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిసి, తనకు న్యాయం చేయాలని వినతిపత్రం అందించారు.
దీనిపై జిల్లా విద్యాధికారి (డీఈఓ) రాము స్పందిస్తూ.. సర్టిఫికెట్ వెరిఫికేషన్ రోజు నాటికి ఆర్సీఐ సర్టిఫికెట్ రెన్యువల్ కాలేదని ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి ఉన్నతాధికారుల ఆదేశాలతోనే చర్యలు తీసుకున్నామని చెప్పారు. కాగా కలెక్టర్ జోక్యంతోనైనా తన సమస్య పరిష్కారమవుతుందని లక్ష్మీరాజం ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.




