
అమ్మకు అక్షరమాల.. ఉల్లాస్ పరీక్షలు
అక్షరాలు నేర్చుకున్న మహిళలకు పరీక్షలు
చదువు వైపు మహిళల అడుగులు
సీకే న్యూస్ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్ నరసింహ సెప్టెంబర్ 27 2026: మనవరాళ్లతో ఆడుకుంటూ సంతోషంగా గడపాల్సిన వయసులోనూ మహిళలు అక్షరాలు నేర్చుకుంటూ విద్యపై ఆసక్తి చూపుతున్నారు. రాత్రివేళల్లో సమయం కేటాయించి నేర్చుకున్న అక్షరాలు, చదవడం, రాయడంలో తమ నైపుణ్యాన్ని పరీక్షించుకునేందుకు ఆదివారం నిర్వహించిన ‘అమ్మకు అక్షరమాల’ ఉల్లాస్ పరీక్షలకు మహిళా సంఘ సభ్యులు హాజరయ్యారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉల్లాస్ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ‘అమ్మకు అక్షరమాల’ పేరుతో అమలు చేస్తూ మహిళల్లో అక్షరాస్యతను పెంపొందించేందుకు కృషి చేస్తోంది. ప్రతి మహిళా సంఘ సభ్యురాలికి చదవడం, రాయడం వచ్చి, రోజువారీ లావాదేవీలు, రుణ చెల్లింపులు, సంఘానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను స్వయంగా తెలుసుకునేలా చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా అధికారులు చెబుతున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల్లోని సభ్యులకు అక్షరాలు, పదాలు, వాక్యాలు చదవడం, రాయడంపై శిక్షణ ఇచ్చారు. రాత్రివేళల్లో నేర్చుకున్న విషయాలను ఆధారంగా చేసుకుని ఆదివారం పరీక్ష నిర్వహించారు. వయసుతో సంబంధం లేకుండా మహిళలు ఉత్సాహంగా పరీక్షలు రాయడం పలువురిని ఆకట్టుకుంది. అక్షరాస్యత సాధన ద్వారా మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు సంఘాల కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించుకునే అవకాశం కలుగుతుందని నిర్వాహకులు తెలిపారు.



